
ప్రశాంత్‌కిశోర్‌తో జేడీఎస్ చర్చలు..!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నాయకులు హెచ్డీ కుమారస్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ భవిష్యత్తును కాపాడుకునేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే ఆయనతో కుమారస్వామి రెండు విడతల చర్చలు జరిపారు. ఈ విషయాన్ని మంగళవారం కుమారస్వామే స్వయంగా వెల్లడించారు. ‘మేము ప్రశాంత్‌కిశోర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. అతడు మాకు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. 2023లో మేం సొంతంగా అధికారంలోకి వస్తాం’ అని చెప్పారు. కర్ణాటకలో 14 నెలల క్రితం జేడీఎస్, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక ఆ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తోంది.