అమిత్‌ షా రాజీనామాకు సోనియా డిమాండ్‌ 

ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఈ ఘటనలు బాధాకరమన్నారు. మూడు రోజుల ఆందోళనల్లో......

Updated : 26 Feb 2020 16:41 IST

దిల్లీ: ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న ఘటనలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు. మూడు రోజుల ఆందోళనల్లో 20 మంది చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. సీడబ్ల్యూసీ భేటీలో దిల్లీలో పరిస్థితిపై సమీక్షించిన అనంతరం బుధవారం కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ఈ ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవి జరిగాయని ఆమె ఆరోపించారు. భాజపా నేత కపిల్‌ మిశ్రా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఈ అల్లర్లను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు బలగాలను మోహరించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించాయని ధ్వజమెత్తారు.

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య దిల్లీలో గత మూడు రోజులుగా చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది మృతిచెందగా.. వందలాది మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బుధవారం రంగంలోకి దిగిన పారా మిలటరీ బలగాలు పలు చోట్ల కవాతు నిర్వహించాయి. డ్రోన్‌ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. భద్రతా వ్యవహారాలను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు ఉన్న భద్రతా బలగాల సంఖ్యను మరింత పెంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 35 కంపెనీల పారా మిలటరీ బలగాలు భద్రతను చూస్తుండగా.. దీన్ని 45వరకు పెంచాలని నిర్ణయించారు. 800 మంది ప్రత్యేక కమాండోలను మోహరించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

మరోవైపు, దిల్లీలో ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ అల్లరి మూకలు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాయి? ఏవిధంగా దాడి చేస్తున్నాయనే విషయాలను పసిగట్టి అక్కడ అల్లర్లు జరగకుండా నియంత్రించడంతో పాటు మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

నిందితుల్ని కఠినంగా శిక్షించండి: కేంద్రాన్ని కోరిన విజయన్‌

ఈశాన్య దిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ కేంద్రాన్ని కోరారు. ఈ ఘటనలకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించడంలో కేంద్రం వెనకడుగు వేయొద్దని కోరారు. హింసను నియంత్రించేందుకు అవసరమైన పోలీసు బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు.  

ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి: మాయావతి ట్వీట్‌
ఈశాన్య దిల్లీలోని పలుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనల్ని ఖండించిన ఆమె దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఈ అల్లర్లకు పాల్పడినవారిని, వీటిపట్ల నిర్లక్ష్యం వహించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు