నితీష్‌ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్‌ విమర్శలు

దిల్లీ అల్లర్లలో 46 మంది ప్రాణాలు కోల్పోతే వారి గురించి బీహార్‌ ముఖ్య మంత్రి నితీష్‌ కుమార్‌ మాట్లడకపోవడం బాధాకరం అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌.....

Published : 03 Mar 2020 00:35 IST

పాట్నా: దిల్లీ అల్లర్లలో 46 మంది ప్రాణాలు కోల్పోతే వారి గురించి బీహార్‌ ముఖ్య మంత్రి నితీష్‌ కుమార్‌ మాట్లడకపోవడం బాధాకరమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా నితీష్‌ కుమార్‌పై విమర్శలు చేశారు. ‘‘నితీష్‌ కుమార్‌ రాబోయే ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకుంటామని నిన్న పట్నాలో జరిగిన బహిరంగసభలో కార్యకర్తలకు వాగ్దానం చేశారు. కానీ తన 15 ఏళ్ల సుదీర్ఘ పాలనలో కూడా ఇప్పటికీ ఎందుకు పేద రాష్ట్రంగా ఉందనే విషయం గురించి మాత్రం మాట్లడటం లేదు. దిల్లీ అల్లర్ల గురించీ ఆయన ఒక మాట కూడా మాట్లడకపోవడం ఎంతో బాధాకరం’’ అని ట్వీట్‌ చేశారు.

నిన్న పాట్నాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రజలు వలస వెళ్లడాన్ని ఒక సమస్యగా చూడకూడదు. దేశం అంతా ఒక్కటే. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్లొచ్చు’’ అని అన్నారు. ఉద్యోగకల్పన కోసం తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను పరిశీలించాలని ప్రతిపక్షాలను నితీష్‌ కుమార్‌ సవాల్‌ చేశారు. నిరుద్యోగం కారణంగానే బీహార్‌ యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని ప్రశాంత్‌ కిషోర్, కన్హయ్య కుమార్‌ వంటి నాయకులు ఇటీవల నితీష్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో పక్క ప్రశాంత్ కిషోర్‌ ‘బాత్ బీహార్‌ కీ’ అనే కార్యక్రమం ద్వారా దేశంలో పది అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా బీహార్‌ను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేస్తామని అక్కడి యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని