ఇది దిల్లీ కాదు : మమతా బెనర్జీ

ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. అక్కడ జరిగిన ఘటనలు ప్రణాళిక ప్రకారం జరిగిన మారణహోమం అని తనకు సమాచారం ఉందన్నారు.........

Updated : 02 Mar 2020 15:45 IST

కోల్‌కతా: ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లని పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. అక్కడ జరిగిన ఘటనలు ‘ప్రణాళిక ప్రకారం జరిగిన మారణహోమం’ అని తనకు సమాచారం ఉందన్నారు. దిల్లీ శాంతి భద్రతల బాధ్యత కేంద్రం పరిధిలో ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వేల సంఖ్యలో బలగాలు మోహరించినా అల్లర్లు మాత్రం ఆపలేకపోయాయని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారంలో ఉన్న భాజపా ఇప్పటి వరకు క్షమాపణ చెప్పకపోవడం సిగ్గుచేటన్నారు. కోల్‌కతాలో సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది దిల్లీ కాదని.. బంగాల్‌లో ‘గోలీ మారో’ తరహా నినాదాలు చెల్లవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దిల్లీలో మరణించిన వారి కుటుంబాల సంక్షేమం కోసం విరాళాలు సేకరించాలని పార్టీ శ్రేణులకు దీదీ పిలుపునిచ్చారు.

బంగాల్‌కు వచ్చి ఇక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడానికి బదులు దిల్లీ అల్లర్లలో మరణించిన అమాయకులను రక్షించలేకపోయినందుకు క్షమాపణ చెప్పాల్సిందంటూ అమిత్‌ షాపై దీదీ ఆరోపణలు గుప్పించారు. ఆదివారం అమిత్‌ షా కోల్‌కతాలో పర్యటించిన విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా పావులు కదపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాల్ని ఎండగట్టాలన్నారు. తాజాగా దీనిపై మమత విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని