నిషేధానికి ఇది ముందస్తు సంకేతమా? : థరూర్‌

ప్రధాని మోదీ వచ్చే ఆదివారం నుంచి సోషల్‌ మీడియాను వీడే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సామాజిక మీడియాను వీడొద్దంటూ విజ్ఞప్తులు.....

Published : 03 Mar 2020 10:19 IST

దిల్లీ: ప్రధాని మోదీ వచ్చే ఆదివారం నుంచి సోషల్‌ మీడియాను వీడే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాలను వీడొద్దంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌.. ప్రధాని సామాజిక మాధ్యమాలను వీడటంపై ట్విటర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు చేపడుతున్న ముందస్తు చర్యగా ప్రధాని నిర్ణయాన్ని అభివర్ణించారు. ‘‘ప్రధాని ఆకస్మిక నిర్ణయం దేశవ్యాప్తంగా ఆందోళనను రేకేత్తిస్తోంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు ముందస్తు చర్యగా దీన్ని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు మంచితో పాటు ఉపయోగకరమైన సందేశాలను పంచుకొనేందుకు ఒక వేదికగా ఉంటాయని ప్రధానికి కూడా తెలుసు. ఇది ద్వేషాన్ని వ్యాపింపచేయడం గురించి కాదు’’ అని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ కూడా ప్రధాని సామాజిక మాధ్యమాలను వీడటం అనేది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న పనిగా ఆరోపించారు. రాజకీయ విమర్శకుడు, వాజ్‌పేయి మాజీ సహాయకుడు సుధీంద్ర కులకర్ణి కూడా ప్రధాని ట్వీట్‌పై స్పందించారు. ‘‘భారత ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, కమ్యూనికేషన్‌పై అతి పెద్ద దాడి. త్వరలో ప్రజాస్వామ్యంపై కూడా ఇటువంటివి జరగొచ్చు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం’’ అని ట్వీట్ చేశారు. అయితే ప్రధానిని ట్విటర్లో 5.33 కోట్లు, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్లు, ఇన్‌స్టాగ్రాంలో 3.52 కోట్ల మంది అనుసరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని