మధ్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం!

మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందన్న కాంగ్రెస్‌ ఆరోపణలతో రాష్ట్రంలో రాత్రికి రాత్రి రాజకీయం వేడెక్కింది. తమ ప్రభుత్వంలోని మొత్తం ఎనిమిది........

Updated : 04 Mar 2020 23:37 IST

తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపణ

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందన్న కాంగ్రెస్‌ ఆరోపణలతో రాష్ట్రంలో రాత్రికి రాత్రి రాజకీయం వేడెక్కింది. తమ ప్రభుత్వంలోని మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలను భాజపా నేతలు బలవంతంగా హరియాణాలోని ఓ హోటల్‌లో ఉంచారని ఆ రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి జితూ పట్వారీ ఆరోపించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, మంత్రులు నరోత్తం మిశ్రా, భూపేంద్ర సింగ్‌, రామ్‌పాల్‌ సింగ్‌ సహా మరికొంత మంది సీనియర్‌ భాజపా నాయకులు బలవంతంగా అధికార కూటమికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్ని హరియాణాలోని ఓ హోటల్‌కు తరలించారు. కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారని సదరు ఎమ్మెల్యేలే మాకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. వారందర్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే నలుగురు తిరిగొచ్చారు’’ అని పట్వారీ అన్నారు. 

పరిస్థితి అదుపులోనే ఉంది: కమల్‌నాథ్‌, సీఎం

అంతకుముందు మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అధికార కూటమిలో ఉన్న ఓ బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎమ్మెల్యేని భాజపా నాయకులు ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకెళ్లారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్ని ఆకర్షించేందుకు కూడా భాజపా యత్నిస్తోందన్నారు. కుట్రలో భాగంగా భారీ మొత్తంలో నగదు ఇవ్వజూపేందుకు భాజపా యత్నిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం హోటల్లో ఉన్నారన్న ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌, ఒకరు స్వతంత్రులు, మిగిలిన వారు బీఎస్పీ, ఎస్పీకి చెందినవారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపారు. ఎమ్యెల్యేల్ని తిరిగి తీసుకొచ్చేందుకు కొంతమంది కాంగ్రెస్‌ నేతలు హరియాణా వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, హరియాణా పోలీసులు హోటల్‌ వద్దే వారిని అడ్డుకున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఈ పరిణామాలపై స్పందించారు. పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని.. ఎమ్మెల్యేలంతా తిరిగొస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సంచలనం కోసమే ఇలాంటి ఆరోపణలు: భాజపా

మరోవైపు కాంగ్రెస్ ఆరోపణల్ని భాజపా కొట్టిపారేసింది. దిగ్విజయ్‌ తిరిగి రాజ్యసభకు ఎన్నిక కావాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏదో ఒక సంచలనం సృష్టించాలన్న దురుద్దేశంతోనే దిగ్విజయ్ సింగ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

 అసెంబ్లీలో బలాబలాలు..

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114, భాజపా 107, స్వతంత్రులు 4, ఎస్పీ 1, బీఎస్పీ 2 స్థానాల్లో గెలుపొందాయి. మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 116 సీట్లు. దీంతో ఎస్పీ, బీఎస్పీ, నలుగరు సంతంత్రులతో కలిసి కాంగ్రెస్‌ మొత్తం 121 మంది బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని