ఏపీలో ఎన్ని జిల్లాలో చెప్పిన కేసీఆర్‌!

కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారం కోసమే తాపత్రయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల రెండో రోజున గవర్నర్‌ ప్రసంగానికి

Updated : 07 Mar 2020 20:05 IST

రాజ్‌గోపాల్‌ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారం కోసమే తాపత్రయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల రెండో రోజున గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. తన ప్రసంగానికి అడ్డు తగిలిన కాంగ్రెస్‌ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీరును తప్పుబట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ నేతలు కొందరు వద్దని అంటే.. మరికొందరు నేతలు కొత్త జిల్లాలకు డిమాండ్‌ చేశారని.. వాళ్లలో వాళ్లకే బేధాభిప్రాయాలని ఎద్దేవా చేశారు. భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయనీ.. పశ్చిమబెంగాల్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చేయలేదన్నారు. కానీ, తెలంగాణ ఏర్పాటయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణను చూశాకే ఏపీ ప్రభుత్వం కూడా జిల్లాలు చేసే యోచనలో ఉందన్నారు. ఏపీ సీఎం జగన్‌ తనతో మాట్లాడిన దాన్నిబట్టి, తనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు ఏర్పాటుచేసే అవకాశం ఉందని తెలిపారు. 

తప్పుచేస్తే మేమీ స్థాయికి వచ్చేవాళ్లం కాదు
2014 ఎన్నికల సమయంలో భట్టి విక్రమార్క ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుందని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. అలాగే, 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు గోల్‌మాల్‌ చేశామంటూ గోలగోల చేశారన్నారు. కాంగ్రెస్‌ వాళ్లుగెలిస్తే చక్కగా గెలిచినట్టు.. మేమైతే డబ్బులు పెట్టి గెలిచినట్టా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తమకు తెలియదన్నారు. బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ రాజ్‌ ఎన్నికలు నిర్వహిస్తే 32కు 32 జిల్లా పరిషత్‌లలో తెరాసదే హవా అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా తమ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని గుర్తు చేశారు. ఎవరు తప్పు మాట్లాడితే వాళ్లకు ప్రజలు వెంటనే తీర్పుచెబుతారన్నారు. ప్రజా స్వామ్యంలో మంచి జరిగినా చెడు జరిగినా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. దానికి తగిన జవాబు వెంటనే చెబుతారన్నారు. తప్పులు చేసి ఉంటే తాము ఈ స్థాయికే వచ్చేవాళ్లం కాదన్నారు. ఈ రోజు తెరాస తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ వాళ్లు భాజపాతో కుమ్మక్కయ్యారనీ..  లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మొన్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఏం జరిగిందో లోకమంతా చూసిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని