మోదీని కలిసిన సింధియా.. ఏం జరుగుతోంది

మధ్యప్రదేశ్‌ సంక్షోభం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ఉదయం కేంద్రం హోం మంత్రి అమిత్‌ షాతో కలిసి ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

Updated : 10 Mar 2020 16:38 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా నేడు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ ఉదయం అమిత్ షాతో కలిసి సింధియా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. సింధియా భాజపాలో చేరుతారనే ఇటీవల ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే సింధియా భాజపా తీర్థం పుచ్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కష్టాల్లో పడినట్లే. 

2018నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుని పార్టీకి అధికారం దక్కించిన సింధియాకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన సొంత పార్టీపై గుర్రుగా ఉన్నారు. పలుసార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సింధియాను రాజ్యసభకు పంపాలని ఆయన వర్గం చాలా రోజుల నుంచి పట్టుబడుతోంది. అయితే ఆయన స్థానంలో ప్రియాంక గాంధీని నామినేట్‌ చేయాలని పార్టీలోని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది.

దీంతో మరింత అసంతృప్తికి గురైన సింధియా.. నిన్న తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరుకు మకాం మార్చారు. సింధియాను రాజీకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించనట్లు తెలుస్తోంది.  అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వీలుగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని సీఎం కమల్‌నాథ్‌ నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 20 మంది మంత్రులు తమ పదవులను త్యాగం చేశారు కూడా. అయినప్పటికీ సింధియా వర్గం మొగ్గుచూపనట్లు సమాచారం. 
భాజపా సిద్ధంగానే..
అటు సింధియాను పార్టీలోకి తీసుకునేందుకు భాజపా కూడా సిద్ధంగానే ఉంది. ఆయన తమ పార్టీలోకి వస్తే చాలా ఆనందిస్తామని మధ్యప్రదేశ్ భాజపా నేత విశ్వాస్‌ సరంగ్‌ తెలిపారు. భాజపాలో చేరిన తర్వాత సింధియా రాజ్యసభ సభ్యత్వం తీసుకుని, కేంద్ర మంత్రివర్గంలో చేరుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 
కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలుతుందా?
మరోవైపు జ్యోతిరాదిత్య వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. 230 సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది, భాజపాకు 107 మంది సంఖ్యాబలం ఉంది. స్వతంత్ర సభ్యులు నలుగురు, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సమాజ్‌వాదీకి చెందిన ఒకరు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ఒకవేళ సింధియా వర్గం ఎమ్మెల్యేలు 17 మంది రాజీనామా చేస్తే కాంగ్రెస్‌ బలం 97కు పడిపోతుంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని