20మంది ఎమ్మెల్యేల రాజీనామా

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్‌నాథ్

Updated : 10 Mar 2020 16:45 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్‌నాథ్ సర్కార్‌కు బీటలు వారి కుప్పకూలే స్థితికి దిగజారింది. సింధియా పార్టీని వీడిన కాసేపటికే ఆయన వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఈ ఎమ్మెల్యేలంతా తమ రాజీనామా పత్రాలను ఈమెయిల్‌ ద్వారా గవర్నర్‌కు పంపినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. 

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ప్రస్తుతం హోలీ వేడుకల నిమిత్తం లఖ్‌నవూ వెళ్లారు. తాజా పరిణామాల గురించి తెలియగానే ఆయన తన పర్యటనను కుదించుకుని తిరిగి భోపాల్‌ బయల్దేరారు. గవర్నర్‌ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

230 శాసనసభ స్థానాలు గల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, భాజపాకు 107 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ శాసనసభ్యులు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో మొత్తం సభ్యుల సంఖ్య 228గా ఉంది. తాజాగా 20 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే అసెంబ్లీ బలం 208కు తగ్గుతుంది. కమల్‌నాథ్‌ సర్కార్‌ గట్టెక్కాలంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.  

6 గంటలకు భాజపాలోకి సింధియా..

మరోవైపు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా మరికొద్ది గంటల్లో భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం 6 గంటలకు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే సింధియా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. ప్రధానితో భేటీ అనంతరం సింధియా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. 

ఇవీ చదవండి..

కాంగ్రెస్‌కు సింధియా రాజీనామా

సింధియాను బహిష్కరించిన కాంగ్రెస్‌

మోదీని కలిసిన సింధియా

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని