ఎస్పీ, బీఎస్పీ మద్దతు కూడా భాజపాకేనా?

మధ్యప్రదేశ్‌ రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం.. ఆ వెంటనే 20 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో

Updated : 10 Mar 2020 16:54 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం.. ఆ వెంటనే 20 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ సర్కార్‌ తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రభుత్వం కుప్పకూలే స్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఎస్సీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు తాజాగా భాజపా నేత శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. 

ఓవైపు కాంగ్రెస్‌ శాసనసభ్యులు రాజీనామా చేస్తుండగా.. సమాజ్‌వాదీ ఎమ్మెల్యే రాజేశ్ శుక్లా, బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్‌ కుశ్వాహా ఈ మధ్యాహ్నం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. దీంతో ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా భాజపాకు మద్దతిస్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ భేటీపై చౌహన్‌ స్పందించారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, కేవలం హోలీ పండగను పురస్కరించుకుని ఆ ఎమ్మెల్యేలు తనను కలిశారని చౌహన్‌ చెబుతున్నారు. 

భాజపాలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే..

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ ఎమ్మెల్యే బిసాహు లాల్‌ సింగ్‌ నేడు భాజపాలో చేరారు. శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సమక్షంలో ఆయన కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ‘సీనియర్‌ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పార్టీ నా పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అందుకే పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి భాజపాలో చేరా. ఇందులో ఎవరి బలవంతం లేదు. రానున్న రోజుల్లో చాలా మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరుతారు’ అని లాల్‌ సింగ్‌ చెప్పారు. 

గవర్నర్‌కు సీఎం లేఖ..

మరోవైపు రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌.. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు లేఖ రాశారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులను తక్షణమే తొలగించాలని ఆయన కోరారు. 

ఇవీ చదవండి..

20 మంది ఎమ్మెల్యేల రాజీనామా

సింధియాను బహిష్కరించిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌కు సింధియా రాజీనామా

మోదీని కలిసిన సింధియా 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని