ఎవరికి వారే.. కాంగ్రెస్‌లో ఆందోళన..

కాంగ్రెస్‌ పార్టీకి మరో శరాఘాతం.. మధ్యప్రదేశ్‌తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గట్టి పట్టున్న యువనేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికే వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పార్టీకి ఇది పెద్దదెబ్బ అనే చెప్పాలి. 

Updated : 10 Mar 2020 23:49 IST

కాంగ్రెస్‌ పార్టీకి మరో శరాఘాతం.. మధ్యప్రదేశ్‌తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గట్టి పట్టున్న యువనేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికే వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పార్టీకి ఇదో పెద్ద దెబ్బ అనే చెప్పాలి. 

చురుగ్గాలేని  అగ్రనాయకత్వం..

పార్టీలో ఎలాంటి అలజడులు ఏర్పడినా వెంటనే స్పందించాల్సిన పార్టీ అగ్రనాయకత్వం చురుగ్గా ఉండటం లేదు. దీంతో పార్టీ కోసం కష్టపడినవారికి సరైన రీతిలో  గౌరవం లభించడంలేదు. అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండగా రాహుల్‌గాంధీ గత లోక్‌సభ ఎన్నికల తరువాత   దాదాపుగా అస్త్రసన్యాసం చేశారు. ప్రియాంకా గాంధీ రంగంలోకి వచ్చినా ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు విభాగానికే పరిమితమయ్యారు. పైగా ఆమెకు రాజకీయానుభవం లేకపోవడం మైనస్‌ పాయింటే.

పార్టీ నేతలేరి?

పార్టీలో సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ తరువాత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌,  ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌.. తదితరులు చురుగ్గా వ్యవహరించడం లేదు. చిదంబరం పలు కేసుల్లో ఇరుక్కున్నారు. బెంగాల్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదురి బెంగాల్‌ రాజకీయాలకే పరిమితమయ్యారు. పార్టీ వ్యూహకర్తలు ఎప్పటికప్పుడు స్పందించకపోవడంతో పార్టీలో అసమ్మతిని అదుపుచేసేవారు లేకుండా పోయారు.  పార్టీ వైఖరితో విసిగిపోయిన పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. గోవాలో అధికారం అందుకోవాల్సి ఉన్నా పార్టీ నేతల అలసత్వంతో ప్రతిపక్షానికే పరిమితమైంది. కర్ణాటకలోనూ జేడీఎస్‌ నేత కుమారస్వామి సీఎంగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కూలిపోకుండా ఆపేందుకు త్వరిత చర్యలు చేపట్టలేదు. 

2014 నుంచే ప్రారంభం

కాంగ్రెస్‌కు ఇలాంటి ఆటు పోట్లు కొత్తవేం కావు.  80 వ దశకంలో స్వర్గీయ ఇందిరా గాంధీ పార్టీ నుంచి వెళ్లి ఇందిరా కాంగ్రెస్‌ను నెలకొల్పి అద్వితీయ విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ ఉండేది. ఆ పరిస్థితులు నేడు లేవు. రాష్ట్రాల్లో కొత్త కొత్త ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. బలంగా రూపుదిద్దుకుంటున్నాయి.  2018లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.  2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలైంది. మోదీ, అమిత్‌షాల వ్యూహం ముందు కాంగ్రెస్‌ నిలవలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఉనికి కోల్పోయింది.  2014 లోక్‌సభ ఎన్నికల పరాజయం తరువాత కాంగ్రెస్‌ తిరోగమనం ప్రారంభమైందని చెప్పవచ్చు.  పార్టీని ఏకతాటిపై నడిపించే నేత లేకపోవడం పార్టీకి పెనుశాపంగా మారింది.

పొత్తులు పనిచేయడం లేదు..

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలతో పొత్తు పెట్టుకున్నా ఓటమి తప్పలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి ఏకంగా రాహుల్‌గాంధే పరాజయం పాలవడం పార్టీ శ్రేణులను నిర్ఘాంతపరిచింది. ఒకప్పుడు యూపీని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటులోనే విజయం  సాధించడం గమనార్హం. దీంతో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తుకు ఆసక్తి చూపడం లేదు. మహారాష్ట్ర, తమిళనాడు.. తదితర రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో జట్టుకట్టింది. 

యువత అసంతృప్తి..

కాంగ్రెస్‌లో వృద్ధ తరానిదే పైచేయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో వారిదే మెజార్టీ. అన్నింటా వారిదే ఆధిపత్యం.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో  రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌, మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాలు క్రియాశీలకంగా ప్రచారం నిర్వహించారు. అయితే విజయం సాధించిన అనంతరం సచిన్‌కు కేవలం ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రమే లభించింది మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ను సీఎంగా అధిష్ఠానం నిర్ణయించింది. మధ్యప్రదేశ్‌లో సింధియాకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు. సోనియాగాంధీ, ప్రియాంకా జోక్యంతో పాత తరం నేత కమల్‌నాథ్‌కు సీఎం పదవి ఇచ్చారు. ఈ పరిణామాలను గమనించిన యువత పెద్దగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడం లేదు. 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని