సింధియాను పక్కకు పెట్టలేదు: దిగ్విజయ్‌

కాంగ్రెస్‌ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియాను పూర్తిగా పక్కకు పెట్టలేదని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా సింధియా పార్టీని వీడటంపై స్పందించారు......

Updated : 11 Mar 2020 12:59 IST

భోపాల్: కాంగ్రెస్‌ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియాను పూర్తిగా పక్కకు పెట్టలేదని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ నేతలు ఎవరినైనా అడగండి. గత 16 నెలలుగా గ్వాలియర్‌ ఛంబల్‌ డివిజన్‌లో ఆయనకు తెలియకుండా ఏ పని జరగలేదు. ఆయన్ను పక్కకు తప్పించనేలేదు. ఇది చాలా బాధాకరం. మోదీ-షా సంరక్షణలో ఆయన బాగుండాలని కోరుకుంటున్నాను. మహా రాజా మీకు శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారు. 

కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సింధియా మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే నేడు దిల్లీలో ఆయన భాజపాలో చేరునున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అయితే తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ స్పందించారు. ‘‘తమ ప్రభుత్వ మనుగడపై  ఎలాంటి ఆందోళన అవసరంలేదు. మెజార్టీని నిరూపించుకుంటాం. ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తుంది’’ అని తెలిపారు. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి ఐకమత్యంగా, సురక్షితంగా ఉందని ఆ పార్టీ ప్రకటించింది. భాజపా విభజన రాజకీయాలు మధ్యప్రదేశ్‌లో విజయవంతం కావని విమర్శించింది. అయితే ఆ రాష్టంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భాజపా తమ పార్టీ ఎమ్మెల్యేలను భోపాల్ నుంచి దిల్లీలోని ఓ హోటల్‌కు తరలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని