సింధియా విషయంలో మాతప్పు అదే: దిగ్విజయ్‌

మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 22 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 13 మంది తాము కాంగ్రెస్‌ను వీడడం లేదని హామీ ఇచ్చారని తెలిపారు........

Published : 12 Mar 2020 01:29 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 22 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 13 మంది తాము కాంగ్రెస్‌ను వీడడం లేదని హామీ ఇచ్చారని తెలిపారు. సింధియాను రాజ్యసభకు ఎంపిక చేసేలా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే వారంతా బెంగళూరు వెళ్లారన్నారు. భాజపాలో చేరే ఉద్దేశం వారికి ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు.  ఈ నేపథ్యంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో కచ్చితంగా నెగ్గి తీరతామన్నారు. సింధియాకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ చేశామని తెలిపారు. కానీ, ఆయన మాత్రం తాను ఎంపిక చేసిన అభ్యర్థికి ఇవ్వాలని కోరారని చెప్పుకొచ్చారు. దీనికి కమల్‌నాథ్‌ అంగీకరించలేదని వెల్లడించారు. సింధియాను కాంగ్రెస్‌ కేవలం రాజ్యసభకు మాత్రమే పంపగలిగేదని.. కానీ, ‘మోదీ-షా’ అయితే కేంద్రమంత్రి పదవి కూడా ఇవ్వగలుగుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేసిన శివరాజ్‌సింగ్‌ చివరకు సింధియాను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు భారీగా డబ్బులు ఇవ్వజూపారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సింధియా పార్టీని వీడతారని ఊహించలేదని.. అదే కాంగ్రెస్‌ చేసిన తప్పిదమని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని