కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేత

సభలో అనుచితంగా వ్యవహరించారన్న కారణంతో సస్పెండైన ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. తక్షణమే సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం...

Published : 11 Mar 2020 15:23 IST

దిల్లీ: సభలో అనుచితంగా వ్యవహరించారన్న కారణంతో సస్పెండైన ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. తక్షణమే సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఇటీవల దిల్లీలో జరిగిన అల్లర్లపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై మార్చి 11న చర్చ చేపడతామని స్పీకర్‌ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు హౌస్‌లో పేపర్లను చింపి స్పీకర్‌ స్థానం వైపునకు ఉద్దేశపూర్వకంగా వేశారన్న కారణంతో ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలను మార్చి 5న సస్పెండ్‌ చేశారు.

సస్పెండైన వారిలో గౌరవ్‌గొగొయ్‌, ఇబే హిందోన్‌, రాజ్‌ మోహన్‌ ఉన్నిధాన్‌, గుర్జిత్‌ సింగ్ అజ్లా, టీఎన్‌ ప్రతాపన్‌, దీన్‌ కురియకోస్‌, మాణిక్య ఠాగూర్‌ ఉన్నారు. వారిపై ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు. తాజాగా లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సస్పెన్షన్‌ ఎత్తివేతకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. వారిపై సస్పెన్షన్‌ తక్షణమే ఎత్తివేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని