హైకోర్టు తీర్పు జగన్‌కు చెంపదెబ్బ: వర్ల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ నిర్ణయం సీఎం జగన్‌, ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని...

Updated : 11 Mar 2020 16:56 IST

మంగళగిరి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ నిర్ణయం సీఎం జగన్‌, ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పుతో తాడేపల్లిలోని సీఎం నివాసం కంపించిందని.. కొందరికి కాళ్లలో వణుకు, కళ్లలో బెరుకు, వెన్నులో చలి మొదలైందని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో ధర్మాన్ని కాపాడుతూ ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం అరాచక పాలనను సాగిస్తోందని వర్ల విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90శాతం విజయం సాధించాలనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మాచర్లలో నామినేషన్‌ పత్రాలు చించేస్తున్న విషయాన్ని చంద్రబాబు నిన్నే చెప్పారని వర్ల గుర్తు చేశారు. గంటూరు జిల్లా తెదేపా నేతలకు భద్రత కల్పించాలని చంద్రబాబు ఎస్పీని కోరినట్లు చెప్పారు. వైకాపా నేతలు తమ స్థానం నిలబెట్టుకునేందుకే అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. నేతలకు భద్రత కల్పించడం జిల్లా పోలీసులు విధి అని చెప్పారు. తెదేపా నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడి చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుడిభుజం అని.. అతని పేరు తురక కిశోర్‌ అని వర్ల తెలిపారు. జగన్‌ పాదయాత్ర సమయంలో కిశోర్‌ దిగిన ఫొటోలను వర్ల మీడియాకు చూపించారు. నేతలపై దాడి జరిగితే రోడ్డు ప్రమాదం జరిగిందని మంత్రి బొత్స అసత్యాలు చెబుతున్నారని.. ప్రజలే కొట్టారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని