సమస్యలు తీర్చమంటే చితకబాదుతారా?:బండి

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడాన్ని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఖండించారు. సమస్యలు పరిష్కరించమంటే ఇష్టం వచ్చినట్లు చితకబాదుతారా...

Updated : 11 Mar 2020 16:28 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడాన్ని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఖండించారు. సమస్యలు పరిష్కరించమంటే ఇష్టం వచ్చినట్లు చితకబాదుతారా అని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి సమస్యలు పరిష్కరించమని విద్యార్థులు ప్రభుత్వాన్ని అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. వారిని విద్యార్థులనుకుంటున్నారా? విద్రోహ శక్తులనుకుంటున్నారా? అని నిలదీశారు. ఉద్యమకారులమని చెప్పుకుంటూ విద్యార్థి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో త్వరలోనే పాలకులు చూస్తారని బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విద్యార్థులపై దాడి సిగ్గుచేటు: డీకే అరుణ

విద్యారంగ సమస్యలను పరిష్కరించమంటే విద్యార్థులపై దాడి చేయటం సిగ్గుచేటని మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే దాడికి పాల్పడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అడగడం తప్పా? అని ప్రశ్నించారు. లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యలు తీర్చే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. విద్యార్థులకు భాజపా ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా డీకే అరుణ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని