దిల్లీ అల్లర్లు.. ఏ ఒక్కర్నీ వదలం: అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో ఇటీవల ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లపై లోక్‌సభలో వాడీ వేడిగా చర్చ జరిగింది. మూడు రోజుల పాటు దేశ రాజధానిలో అల్లర్లు జరిగి దాదాపు 50 మందికి పైగా చనిపోతే పోలీసులు ఏం చేశారని విపక్షాలు ప్రశ్నించాయి. దీనికి కేంద్ర..

Updated : 11 Mar 2020 21:53 IST

ఈశాన్య దిల్లీ ఘటనపై లోక్‌సభలో వాడీవేడి చర్చ

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో ఇటీవల ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లపై లోక్‌సభలో వాడీ వేడిగా చర్చ జరిగింది. మూడు రోజుల పాటు దేశ రాజధానిలో అల్లర్లు జరిగి దాదాపు 50 మందికి పైగా చనిపోతే పోలీసులు ఏం చేశారని విపక్షాలు ప్రశ్నించాయి. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. హింసాత్మక ఘటనల్ని నిలువరించడంలో దిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును విపక్షాలు ఆక్షేపించాయి. అల్లర్లతో దిల్లీ కాలిపోతుంటే హోంమంత్రి ఎక్కడికి వెళ్లారని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి ప్రశ్నించారు. అయితే, దీనిపై భాజపా దీటుగా బదులిచ్చింది. విపక్షాలు దీన్ని రాజకీయం చేసి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టింది. దిల్లీ అలర్లపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి తొలుత ఆయన నివాళులర్పించారు. సీఏఏ పౌర హక్కులను హరించదనీ.. ప్రతిపక్షాలు ఈ అంశంలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఏఏ అల్లర్ల అంశంపై హోలీ తర్వాత చర్చ జరపాలనుకున్నామన్నారు. హోలీ పండుగ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతోనే ఇంతవరకు దీనిపై చర్చించలేదన్నారు. అల్లర్ల సమయంలో పోలీసులు పనితీరు ప్రశంసనీయమన్నారు. ఈశాన్య దిల్లీలో చెలరేగిన ఈ అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా బాగా చక్కగా పనిచేశారని తెలిపారు. అమిత్‌ షా ప్రసంగం సమయంలో కాంగ్రెస్‌, వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రగా కనబడుతోంది..
దిల్లీ అల్లర్లతో సంబంధం ఉన్న వారు ఏ మతం, ఏ కులం, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా వదిలే ప్రసక్తే లేదని అమిత్‌ షా స్పష్టంచేశారు. దేశంలో అల్లర్లకు పాల్పడితే ఏం జరుగుతుందో తాము తీసుకోబోయే చర్యలు ఓ పాఠంగా నిలుస్తాయని చెప్పారు. ఈ హింస ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రగా కనిపిస్తోందన్నారు.  అల్లర్లను నియంత్రించేందుకు తాను దిల్లీ పోలీసులతోనే నిరంతరం టచ్‌లో ఉన్నాననీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిల్లీ పర్యటనకు వచ్చినా ఆ కార్యక్రమాల్లో సైతం తాను హాజరు కాలేదని వివరించారు. పోలీసుల్లో ధైర్యాన్ని ఇనుమడింపజేసేందుకు తన అభ్యర్థన మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ అల్లర్లు జరిగిన ప్రదేశాల్లో పర్యటించారని షా తెలిపారు. 

అమాయకుల్ని అరెస్టు చేయలేదు

ఫిబ్రవరి 27 తర్వాత 700 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయనీ.. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న ఇరు వర్గాలకు చెందిన 2647 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. అమాయకులెవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. బలమైన ఆధారాలతోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు. దిల్లీ అల్లర్లను 36 గంటల్లో నియంత్రించడంలో పోలీసులు విజయవంతమయ్యారన్నారు. ఈ అల్లర్లకు పాల్పడిన ఎవరినీ వదిలేదని లేదని స్పష్టంచేశారు. దేశంలో సీఏఏ వ్యతిరేక ర్యాలీల కన్నా అనుకూలంగానే ఎక్కువ ర్యాలీలు జరిగాయని అమిత్‌ షా అన్నారు. శాంతి భద్రతలు కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమన్న అమిత్‌ షా.. దిల్లీ అల్లర్లలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని