
ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది: కన్నా
విజయనగరం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితులు కన్పించడం లేదని.. రాష్ట్ర ఎన్నికల సంఘం కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నవరత్నాల పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయనగరంలో ఆధునికీకరించిన పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వైకాపా నాయకులు, కార్యకర్తల్లా వ్యవహరిస్తూ అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కన్నా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగుతున్న తీరుపై కేంద్ర హోం శాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు కన్నా తెలిపారు.
విద్యాసంస్థల అభివృద్ధికి ఉదారంగా పూసపాటి వంశీయ మహారాజులు భూములు ఇచ్చి మాన్సాస్ ట్రస్టును ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అయితే ట్రస్టు విషయంలో తాజా పరిణామాలను భాజపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సింహాచలం దేవస్థానం, ట్రస్టు పాలకమండలి మార్పు జీవోను ఎందుకు దాచిపెట్టారో ప్రభుత్వం స్పష్టం చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు.