
వైకాపా దౌర్జన్యాలపై అమిత్‌షాకు ఫిర్యాదు
దిల్లీ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్ర భాజపా ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ ఆయన్ను కలిసి ఫిర్యాదు లేఖను అందజేశారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను వైకాపా నేతలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అమిత్‌షాతో భేటీ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. అధికారులు వైకాపాకు సహకరిస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. పోలీసులు కూడా వైకాపాకు మద్దతుగా మాట్లాడుతూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు.
ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భాజపా నేతలు నామినేషన్ వేసే చోట పోలీసులు అడ్డుకోవడంతో పాటు దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే కేంద్రహోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని సీఎం రమేశ్ చెప్పారు. ఏపీ ప్రజలు సంతోషాన్ని మరిచిపోయి చాలా రోజులైందని మరో ఎంపీ టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం చేస్తు్న్న తప్పులకు కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉందన్నారు. భాజపా, జనసేన నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా దాడులు చేసి ఏం సాధించాలనుకుంటున్నారని వైకాపాను ఆయన ప్రశ్నించారు.