అందుకే తెరాసకు మా మద్దతు:అక్బరుద్దీన్‌

తెలంగాణలో మైనారిటీలు పొందుతున్న సంక్షేమ పథకాలు చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోందని ఎంఐఎం శాసన సభాపక్షనేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెరాస, ఎంఐఎం స్నేహబంధంతోనే ఇది సాధ్యపడిందన్నారు. శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చలో...

Updated : 13 Mar 2020 22:41 IST

హైదరాబాద్: తెలంగాణలో మైనారిటీలు పొందుతున్న సంక్షేమ పథకాలు చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోందని ఎంఐఎం శాసన సభాపక్షనేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెరాస, ఎంఐఎం స్నేహబంధంతోనే ఇది సాధ్యపడిందన్నారు. శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చలో అక్బరుద్దీన్‌ మాట్లాడారు. వక్ఫ్‌ ఆస్తుల అన్యాక్రాంతంపై సీబీఐ లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వక్ఫ్‌ ఆస్తులు దురాక్రమణకు గురవుతున్నాయని.. 20 ఏళ్లుగా ఇదే అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతున్నామని చెప్పారు. తమ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 53 సమస్యలను పరిష్కరించిందన్నారు. అందుకే కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మజ్లిస్‌ మద్దతుగా ఉంటోందని వివరించారు. వక్ఫ్‌ బోర్డు, రెవెన్యూ రికార్డులను రివ్యూ చేయాలని.. వక్ఫ్‌ బోర్డు భూములపై జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇఫ్తార్‌ నిధులు అనాథ శరణాలయాలకు ఇవ్వండి

ప్రభుత్వం ఏటా ఇఫ్తార్‌ విందులకు ఖర్చు చేస్తున్న నిధులు అనాథ శరణాలయాలకు ఇవ్వాలని అక్బరుద్దీన్‌ ప్రభుత్వాన్ని కోరారు. వితంతు, ఒంటరి ముస్లిం మహిళలకు వసతి గృహాల నిర్మాణం, మైనారిటీలకు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖలో ఉద్యోగులు 235 మంది మాత్రమే ఉన్నారని.. వారిలో అత్యధిక శాతం ఒప్పంద ఉద్యోగులే ఉన్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విజయా బ్యాంకులో మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన నగదు ఉందని.. ఆ నగదును వెంటనే విడిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్‌ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని