
రేణిగుంటలో కొనసాగుతున్న ఉద్రిక్తత
చిత్తూరు: రేణిగుంట పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఏర్పేడు జనసేన జడ్పీటీసీ అభ్యర్థి నితీష్‌పై రేణిగుంటకు చెందిన వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో నితీష్‌ను ఏర్పేడుకు తరలించేందుకు రేణిగుంట పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నితీష్ వాహనం నుంచి దూకాడు. ఏర్పేడుకు వెళ్తే వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని నితీష్ వాపోయాడు. పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పోలీసులు జనసేన రాష్ట్ర సమన్వయ కర్త పసుపులేటి హరిప్రసాద్, పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు బొలిశెట్టి సత్యను అరెస్టు చేశారు. జడ్పీటీసీ నామినేషన్ వెనక్కి తీసుకోనందుకే కక్ష సాధిస్తున్నారని ఈ సందర్భంగా హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని జనసేన నాయకులు ఆరోపించారు. మరోవైపు తిరుపతిలోని కొర్లగుంట ఎనిమిదో వార్డు స్వతంత్ర అభ్యర్థినికి వైకాపా నేతల నుంచి బెదిరింపులు వచ్చాయి. తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని తిరుపతి తూర్పు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.