
విజయమ్మ తెగువ భళా!
ఆమెది ఏ పార్టీ అనే విషయాన్ని ఎవరూ ఆలోచించలేదు. ఆ తెగువ.. ఆక్రోశం.. ఆవేశానికి సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు జేజేలు పలికారు. ఆ మహిళ పట్టుదలను చూసి రాణి రుద్రమదేవిగా పోల్చుతూ హ్యాష్ ట్యాగ్లు జతచేరాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల రభస నాలుగు రోజులుగా రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. అక్కడ భయకంపిత వాతావరణం నెలకొంది. స్థానిక తెదేపా అభ్యర్థి విజయమ్మ పురపాలక సంఘంలోని ఆరో వార్డుకు పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాన్ని సిద్ధం చేసుకున్నారు. చేతిలో ఉంచుకుంటే బలవంతంగా లాక్కుపోతారన్న అంచనాతో రవికెలో దాచిపెట్టుకుని నామినేషన్ కేంద్రానికి బయలుదేరారు. అయినా పసిగట్టిన ప్రత్యర్థులు దారిలో చుట్టుముట్టారు. నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కెళ్లిపోయారు. దీంతో ఆమె నామినేషన్ వేయలేకపోయారు. ఆవేశం, ఆక్రోశం పెల్లుబికిన విజయమ్మ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. సహచరులు వారించి, అడ్డుకున్నారు. ఈ వీడియోలు ప్రసార, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో అంతటా చర్చ సాగుతోంది. పుంగనూరులోనే మరో మహిళ బురఖా ధరించి నామినేషన్ వేయడానికి రాగా ప్రత్యర్థులు ఆమెనూ అడ్డుకున్నారు.