రాష్ట్రాన్ని ఎస్‌ఈసీయే పాలించవచ్చు కదా?:జగన్‌

కరోనా వైరస్‌పై తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేవలం 60 ఏళ్లు పైబడిన వాళ్లు, డయాబెటిక్‌, బీపీ, కిడ్నీ, ....

Updated : 15 Mar 2020 17:09 IST

కరోనాపై తీవ్ర ఆందోళన అవసరం లేదు

వ్యవస్థల్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం ఏకపక్షం

పది రోజుల్లో ఎన్నికలు పూర్తిచేయాలి

అమరావతి: స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రమేశ్‌కుమార్‌ ప్రకటించడాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తప్పుబట్టారు. కరోనా వైరస్‌ కారణంతో ఎన్నికలు వాయిదా వేయడం సరికాదన్నారు. కేవలం 60 ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు డయాబెటిక్‌, బీపీ, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులు ఉన్న వారికి కరోనా వస్తే హానికరమైన వ్యాధిగా పరిగణించాలని చెప్పారు. కరోనా వైరస్‌తో రాష్ట్రంలో కేవలం ఒక్క కేసే నమోదైందని.. దీన్ని సాకుగా చూపి స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై ఆయన మండిపడ్డారు. అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదని ముందు జాగ్రత్తగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టామన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం మీడియా సమావేశం నిర్వహించారు.

కరోనా పరీక్షలు.. రెండు మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను జగన్‌ వివరించారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంతో మంది ఇతర దేశాల్లో ఉన్నారని.. వారిని అక్కడి ప్రభుత్వాలు స్వస్థలాలకు పంపే అవకాశమున్నట్లు చెప్పారు. ఆ విధంగా రాష్ట్రానికి వచ్చే వారికి ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇది రెండు మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని.. ఈ చర్యలు సుమారు ఏడాదిపాటు కొనసాగుతాయని సీఎం వివరించారు. తొలుత ఆయన స్థానిక ఎన్నికల వాయిదా ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవస్థలను తెదేపా అధినేత చంద్రబాబు నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల వాయిదాపై కనీసం సీఎస్‌, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులతోనూ చర్చించలేదని జగన్‌ ఆరోపించారు. ఎన్నికల వాయిదాపై జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం వారిని సంప్రదించినట్లు పేర్కొన్నారని.. విచక్షణాధికారం పేరుతో ఎస్‌ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సీఎం ఆరోపించారు.

ఎవరో ఆర్డర్లు రాసిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారు!

ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ తన విచక్షణ కోల్పోయి మాట్లాడారని సీఎం విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ నియమితులయ్యారని చెప్పారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మేం నియమించలేదు. ఎస్‌ఈసీకి కుల, మతం, ప్రాంతం అనే స్వార్థాలు ఉండకూడదు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్‌ఈసీ పదవిలోకి తీసుకున్నారు. ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారు. విచక్షణాధికారం పేరుతో ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కలెక్టర్లు, ఎస్పీలను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా తప్పిస్తారు? ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పాలించవచ్చు కదా?’’ అని తీవ్రస్థాయిలో జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా జోరుతో తెదేపాకు భయం

స్థానిక ఎన్నికల్లో వైకాపా జోరు చూసి తెదేపాకు భయం పట్టుకుందని జగన్‌ ఆరోపించారు. 10,243 చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే కేవలం 43 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయన్నారు. 2794 వార్డుల్లో 15,185 నామినేషన్లు దాఖలైతే.. వీటిలో 14 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పారు. ఏ స్థానిక ఎన్నికల్లోనైనా ఇంతకంటే తక్కువ ఘటనలు జరిగాయా? అని సీఎంప్రశ్నించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పోలీసులు ఎక్కడా ప్రేక్షకపాత్ర వహించలేదని.. నిబద్ధతతో వ్యవహరించారని చెప్పారు. ‘‘ఏకగ్రీవాలు కావడం కొత్తేమీ కాదు. 2013లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ జరిగాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో వైకాపా విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మా మేనిఫెస్టోలో ఏం చెప్పామో దాన్ని అమలు చేస్తున్నాం. ప్రజలు మెచ్చుకునేలా మంచి పాలన తీసుకొచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా స్వీప్‌ చేస్తే చంద్రబాబు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు?’’ అని జగన్‌ ప్రశ్నించారు.

ఆ నిధులు ఎందుకు పోగొట్టాలి?

‘‘మార్చి 31లోపు ఎన్నికలు పూర్తయితే 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.5వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వీలుంటుంది. ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు రావు. ఆ నిధులను ఎందుకు పోగొట్టాలి? అవి వస్తే ఎక్కడో ఓ చోట అభివృద్ధి కనిపిస్తుంది కదా. కేవలం సీఎం కాలేకపోయాననే ఒకే ఒక్క కోపంతోనే చంద్రబాబు ఈ విధంగా చేయించారు. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడటం వల్ల ఆ నిధుల పరిస్థితేంటి? వచ్చే ఏడాది నిధులూ పోవాలా? దీని గురించి ఆలోచించాలి. పది రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి. ఎన్నికలు పూర్తి చేసేస్తే అభివృద్ధి కోసం అడుగులు ముందుకు వేయొచ్చు. కానీ ఇలా జరగకూడదని భావించడంతో ఎవరికి అన్యాయం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. స్థానిక ఎన్నికల వాయిదా అంశంలో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ నిర్ణయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఎస్‌ఈసీని పిలిచి మాట్లాడాలని చెప్పాం. అప్పటికీ ఎస్‌ఈసీలో మార్పు రాకపోతే ఈ అంశాన్ని పైస్థాయికి తీసుకెళతాం’’ అని జగన్‌ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని