బలపరీక్ష.. వ్యూహాల్లో పార్టీలు..!

మధ్యప్రదేశ్‌ రాజకీయాలు ఆదివారం మరింత వేడెక్కాయి. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ అసెంబ్లీ స్పీకర్‌ నర్మద ప్రసాద్‌ ప్రజాపతికి సూచించడంతో.. ఇరు పార్టీల వర్గాల్లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి.

Published : 15 Mar 2020 15:26 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌ రాజకీయాలు ఆదివారం మరింత వేడెక్కాయి. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ అసెంబ్లీ స్పీకర్‌ నర్మద ప్రసాద్‌ ప్రజాపతికి సూచించడంతో.. ఇరు పార్టీల వర్గాల్లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ భోపాల్‌లో కేబినెట్‌ సమావేశానికి పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం స్వతంత్ర ఎమ్మెల్యే ప్రదీప్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. ‘మా వద్ద బలపరీక్షలో నెగ్గడానికి అవసరమైన ఎమ్మెల్యేల బలం ఉంది. సీఎం కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కొంత సమయం వేచి చూడాలి. విశ్వాస పరీక్ష రేపు జరుగుతుందో లేదా కరోనా కారణంగా వాయిదా పడుతుందో చూడాలి’అన్నారు. ఇప్పటికే జైపూర్‌కు తరలించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ తిరిగి భోపాల్‌కు రప్పించారు. వారందరినీ భోపాల్‌లోని మారియట్‌ హోటల్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

భాజపా సైతం రేపు జరగబోయే విశ్వాసపరీక్షకు సిద్ధంగా ఉండాలంటూ విప్‌ జారీ చేసింది. అంతేకాకుండా బలపరీక్షపై దిల్లీలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నివాసంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, జ్యోతిరాదిత్య సింధియా సమావేశమయ్యారు. మరోవైపు బెంగళూరులో ఉన్న 21 మంది కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలను గోల్ఫ్‌షైర్‌ క్లబ్‌ హోటల్‌ నుంచి యలహంకలోని రమద హోటల్‌కు తరలించారు. హోటల్‌ బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

బెంగళూరులో ఉన్న కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల్లో శనివారం రాత్రి ఆరుగురి రాజీనామాలను స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించిన విషయం తెలిసిందే. రాజీనామా ఆమోదించిన వారు ఆరుగురు మంత్రులే కావడం గమనార్హం. వారందరినీ రాజీనామా ఆమోదానికి ముందే కేబినెట్‌ నుంచి తొలగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని