ధరలు తగ్గించమంటే..ఇంకా పెంచారు: రాహుల్

దేశంలో ఇంధన ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు...

Updated : 15 Mar 2020 16:58 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో.. దేశంలోనూ ఇంధన ధరలు తగ్గించి ప్రజలకు మేలు చేయమని కోరితే ఇంకా పెంచడమేంటని ఆయన ప్రధాని మోదీని తప్పుబట్టారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

‘‘గ్లోబల్‌ మార్కెట్లు ఇంధన ధరలు భారీగా పతనమయ్యాయి. ఆ ప్రయోజనాల్ని దేశ ప్రజలకు అందించాలని నేను మూడు రోజుల కింద ప్రధానికి సూచించాను. కానీ, మన మేధావి ఆ సలహాను పట్టించుకోకుండా ఉన్న ధరలపైనే ఇంకా ఎక్సైజ్‌ డ్యూటీ పెంచారు’’ అని విమర్శించారు. దీంతో పాటు రాహుల్‌ ట్వీట్‌కు ఓ వీడియోను కూడా జతచేశారు. తాజాగా నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చమురు ధరల ప్రయోజనాల్ని ప్రజలకు ఎందుకు అందించడం లేదు అని అడిగిన ఓ విలేకరి ప్రశ్నను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దాటవేశారు. 

ఇప్పటికే బుధవారం ముడిచమురు ధరలపై స్పందించిన రాహుల్‌గాంధీ.. ‘మీరు ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే పనిలో పడి.. గ్లోబల్‌ మార్కెట్లో ముడి చమురు 35శాతం పతనమైన విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. ఆ తగ్గిన ధరలను దేశీయంగా అమలు చేసి ప్రజలకు లబ్ది చేకూర్చండి’ అని సూచించారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ఇంధన ధరలపై రూ.3 ఎక్సైజ్‌ డ్యూటీ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ.39వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని