
నేడు కమల్ సర్కార్‌కు బలపరీక్ష లేనట్లేనా?
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సంక్షోభంలో కూరుకుపోయిన కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ నేడు బలపరీక్ష ఎదుర్కొనే అవకాశాలు కన్పించట్లేదు. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ దీనిపై ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు సోమవారం శాసనసభ ఎజెండాలో బలపరీక్ష ప్రస్తావన లేకపోవడంతో నేడు కమల్ సర్కార్ విశ్వాస పరీక్షను ఎదుర్కోకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
నేటి నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే నేటి ఎజెండాలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ సంప్రదాయ ప్రసంగంతో పాటు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మాత్రమే ఉన్నాయి. బలపరీక్ష గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అటు స్పీకర్ కూడా దీనిపై సోమవారమే నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో నేడు విశ్వాస పరీక్ష జరిగేలా కన్పించట్లేదు.
బలపరీక్షకు సిద్ధమే..
మరోవైపు అసెంబ్లీ తమ బలాన్ని నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అన్నారు. నిన్న రాత్రి గవర్న్ లాల్జీ టాండన్‌ను కలిసిన ఆయన.. స్పీకర్ నిర్ణయిస్తే విశ్వాసపరీక్షకు తాను ఎప్పుడైనా సిద్ధమేనన్నారు.
రాష్ట్రానికి భాజపా 6ఎమ్మెల్యేలు
ఇదిలా ఉండగా.. సంక్షోభం నేపథ్యంలో గత ఐదు రోజులుగా హరియాణాలో ఉన్న భాజపా ఎమ్మెల్యేలు నేడు రాష్ట్రానికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున వారంతా భోపాల్ విమానాశ్రయానికి చేరుకోగా.. రాష్ట్ర భాజపా యంత్రాంగం ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించింది.