
పాలనలో ఎస్‌ఈసీ జోక్యమెందుకు?:తమ్మినేని
శ్రీకాకుళం: పరిపాలనలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) జోక్యం చేసుకుంటే సీఎం ఎందుకని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో తీర్పు ఆలస్యంతో ఎన్నికల నిర్వహణ కూడా ఆలస్యమైందని చెప్పారు. స్థానిక ఎన్నికల వాయిదాను ఉద్దేశిస్తూ రాజ్యాంగ వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయని ఆయన ఆక్షేపించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలన్నారు.
స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ ప్రకటన చేయడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఎన్నికల నోటిఫికేషన్, విధివిధానాలు అమలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని.. జాతీయ విపత్తులు ఏర్పడితే ప్రభుత్వ యంత్రాంగం సూచనల మేరకు నిర్ణయం ప్రకటించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ విధి అని.. కానీ పాలనలో జోక్యం చేసుకోకూడదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ప్రజల మధ్యకు వెళ్లాలని, కుట్రలు చేయడం తగదని పరోక్షంగా తెదేపాను ఉద్దేశించి తమ్మినేని విమర్శించారు.