‘చంద్రబాబు కుట్రను ఎస్‌ఈసీ అమలు చేశారు’

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేయడంపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు

Updated : 16 Mar 2020 13:55 IST

అభ్యర్థులను పెట్టలేని పార్టీలూ మమ్మల్ని విమర్శిస్తున్నాయి
ఫ్రాన్స్‌లో 127 మంది చనిపోయినా ఎన్నికలు నిర్వహించారు
ఏపీ మంత్రి అనిల్‌ యాదవ్‌ వ్యాఖ్యలు

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేయడంపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక వ్యక్తి కోసమో, తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుండాలనో ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కరోనా పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదన్నారు. ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను నిలబెట్టుకోలేక ఏం చేయాలో తోచక ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ను అడ్డం పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయించాయని ఆరోపించారు.
ఎన్నికలు వాయిదా వేశాక కోడ్‌ అమల్లో ఎలా?
ఎన్నికల కమిషన్‌కు విచక్షణాధికారం ఉందని.. కానీ విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడిదని మంత్రి ప్రశ్నించారు. కరోనా వైరస్ కోసం ఎన్నికలు వాయిదా వేసే ముందు రాష్ట్రంలో అధికారులను ఎవరినైనా  సంప్రదించారా? అని మంత్రి నిలదీశారు. రాష్ట్రంలో 45 రోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ తెదేపా అధినేత చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులను పెట్టుకోలేని పార్టీలు కూడా తమను విమర్శిస్తున్నాయని పరోక్షంగా జనసేనను ఉద్దేశించి అనిల్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారులను బదిలీ చేసే అధికారం ఎస్‌ఈసీకి ఎక్కడిదని మంత్రి నిలదీశారు. ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత కోడ్‌ ఎలా అమల్లో ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్ర చేస్తే ఎస్‌ఈసీ దాన్ని అమలు చేశారని ఆరోపించారు. ఫ్రాన్స్‌లో 5,500 కరోనా కేసులు నమోదై 127 మంది చనిపోయినా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంత దారుణమైన పరిస్థితి లేదని.. యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని మంత్రి అనిల్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని