బయటపెట్టరెందుకు? రాహుల్‌ గాంధీ 

రానున్న కాలంలో మరిన్ని బ్యాంకులు దివాలా తీయనున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Published : 16 Mar 2020 18:53 IST

లోక్‌సభలో విమర్శలను తిప్పికొట్టిన అనురాగ్‌ ఠాకూర్‌

దిల్లీ: దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ పనితీరు శూన్యమని.. రానున్న కాలంలో మరిన్ని బ్యాంకులు దివాలా తీయనున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంటులో గుదిబండలా తయారైన అనుత్పాదక రుణాల అంశాన్ని ఆయన నేటి లోక్‌సభ సమావేశంలో లేవనెత్తారు. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేయటంలో తొలి 50 స్థానాల్లో ఉన్న వారి పేర్లను, వారి నుంచి బాకీ వసూలుకు మోదీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోందో అనే వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

రాహుల్‌ ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ స్పందిస్తూ...  బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుత సంక్షోభం గత కాంగ్రెస్‌ ప్రభుత్వ పుణ్యమేనని, వారి హయాంలోనే రుణాల ఎగవేత వ్యవహారాలు జరిగాయని తిప్పికొట్టారు. ఎగవేతదారుల పేర్లను భాజపా ప్రభుత్వం దాచిపెడుతోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు వీలు కల్పించే ‘ఫ్యుజిటివ్‌ ఎకనమిక్‌ యాక్ట్‌’ను మోదీ ప్రభుత్వమే తీసుకువచ్చింది మంత్రి వివరించారు. ‘‘బకాయిదారుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లోనే లభిస్తున్నాయి. దాచేందుకు ఏమీ లేదు. ఎగవేతదారులందరూ వారి (కాంగ్రెస్) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తప్పించుకున్నారు. సభ సీనియర్‌ సభ్యుడి ప్రశ్న, ఆ విషయంలో ఆయన అజ్ఞానాన్ని తెలియచేస్తోంది.’’ అని అనురాగ్‌ ఠాకూర్‌ తిప్పికొట్టారు.

కాగా రాహుల్‌ గాంధీ లోక్‌సభ వెలుపల మీడియాతో మాట్లాడుతూ... బకాయిదారుల గురించి తను అడిగిన అతి సాధారణ ప్రశ్నకు ఈ సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. ఈ విషయానికి సంబంధించి మరో ప్రశ్న వేయటానికి స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించకపోవటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని