జాతి నిర్మాణంలో తెలంగాణది కీలకపాత్ర:కేసీఆర్‌

తమకు పరిపాలన చేతకాదని కొందరు సమైక్యవాదులు గతంలో చెప్పారని.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ అనేక రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని సీఎం

Updated : 16 Mar 2020 18:25 IST

హైదరాబాద్‌: తమకు పరిపాలన చేతకాదని కొందరు సమైక్యవాదులు గతంలో చెప్పారని.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ అనేక రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ విషయం తాము చెబుతోంది కాదని.. కాగ్‌ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రులు సైతం అనేక సందర్భాల్లో పార్లమెంట్ లోపలా వెలుపలా తెలంగాణకు అనేక కితాబులిచ్చారని గుర్తు చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పథకం కింద రాష్ట్రంలో సుమారు 24వేల గ్రామాలకు నీళ్లిచ్చామని.. ఏదో ఒక గ్రామానికి నీరు ఇవ్వలేదని మొత్తం మిషన్‌ భగీరథ పథకాన్నే కించపరడం తగదని భట్టిని ఉద్దేశించి విమర్శించారు. మంచిని మంచి అనే సంస్కారం లేకుండా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం కొనియాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా మొత్తం చెడ్డ పనులు చేయదని.. చాలా వరకు మంచి పనులే చేస్తుందన్నారు. 

కాంగ్రెస్‌ నేతలకు వృద్ధి కనబడదా?

మంచి పనులను సమర్థిస్తూ చెడ్డవాటిని విమర్శిస్తే బాగుంటుందని భట్టి విక్రమార్కను ఉద్దేశించి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. భట్టి నోటి నుంచి ఒక్క పొగడ్తకూ తమ ప్రభుత్వం నోచుకోలేదని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇంతకంటే ఎక్కువే విమర్శలు చేశారని.. తామూ వాదించామన్నారు. అన్నీ గమనించే ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలు తమ పంథా మార్చుకోవాలని సీఎం హితవు పలికారు. ఐదేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.70లక్షల కోట్లు చెల్లించామని.. కేంద్రం మాత్రం రూ.1.12లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆక్షేపించారు. జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని.. దేశాన్ని సాకే రాష్ట్రాల్లో  ముందుంటోందన్నారు. ‘వేసిన పంట పండుతుందా? పండదా? అనే స్థితి నుంచి దర్జాగా పంటలు పండించుకునే స్థితికి రాష్ట్రం వచ్చిందా లేదా?ఇది వృద్ధి కాదా? కాంగ్రెస్‌ నేతలకు ఇది కనబడదా?ఎక్కడో పాతాళంలో ఉన్న తెలంగాణ..  ప్రస్తుతం తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌. ఇది నిజంకాదా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

విజయా డెయిరీని సర్వనాశనం చేశారు.

‘కాంగ్రెస్‌ హయాంలో రూ.200గా ఉన్న పింఛను మొత్తాన్ని మేం భారీగా పెంచాం. మేనిఫెస్టోలో పెట్టని కల్యాణలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. తొలుత ఆ పథకానికి రూ.51వేలు ఇచ్చాం. తర్వాత ఆ మొత్తాన్ని రూ.లక్షపైగా పెంచాం. బీడీ కార్మికుల సహా ఎన్నో వర్గాల వారికి పింఛన్లు అందిస్తున్నాం. ఇది నిజం కాదా? ఆర్థికంగా పరిస్థితి బాగోలేకపోతే ఈ పథకాలన్నీ ఎలా నడుపుతున్నాం? ఏదో కానట్టు.. ఏమీ జరగనట్టు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. తెదేపా, కాంగ్రెస్‌ హయాంలో విజయా డైయిరీని సర్వనాశనం చేశారు. విజయా నెయ్యికి ముంబయి సహా ఉత్తర భారతంలో అద్భుతమైన డిమాండ్‌ ఉండేది. దాన్నీ శంకరగిరిమాన్యాలు పట్టించారు. అలా చేసిందెవరో అందరికీ తెలుసు. తెదేపా, కాంగ్రెస్‌ హయాంలో పాల ఉత్పత్తిదారులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మేం లీటరుకు రూ.4 ప్రోత్సాహం ఇచ్చి అద్భుతమైన ప్రగతి వైపు తీసుకెళ్లాం. ఇప్పుడు విజయా డెయిరీ కళకళలాడుతోంది. త్వరలోనే కామారెడ్డిలో పాల ఉత్పత్తి కేంద్రం పెట్టబోతున్నాం’ అని సీఎం వివరించారు.

కాంగ్రెస్‌, భాజపా దొందూ దొందే

‘2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ఇసుకపై సంపాదించింది కేవలం రూ.40 కోట్లు మాత్రమే. ఈ ఐదేళ్లలోనే మేం రూ.2,384 కోట్లు సంపాదించాం. ఈ ఏడాది కనీసం ఆరేడు వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నాం. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఇన్‌పుట్‌ సబ్సిడీని మేం చెల్లించాం. కనీస మద్దతు ధరలు ప్రకటించే కేంద్రప్రభుత్వం.. చివరి గింజ వరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలి. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, భాజపా దొందూదొందే. దేశాన్ని డ్రామా కంపెనీలా చేశాయి. నాణ్యమైన విద్యుత్‌ కోసం విద్యుత్‌ ఛార్జీలను పెంచక తప్పదు’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్‌ పోచారం ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని