Updated : 17/03/2020 04:33 IST

కమల్‌నాథ్‌ సర్కార్‌కు గవర్నర్‌ డెడ్‌లైన్‌

నేడు బలం నిరూపించుకోవాలని ఆదేశం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కరోనా భయాందోళనల నేపథ్యంలో మార్చి 26వరకు వాయిదా పడటంతో కమల్‌ సర్కార్‌కు కాస్త ఊరట లభించిందనుకున్న కొద్ది గంటల్లోనే మరో షాక్‌ తగిలింది. మంగళవారంలోగా అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు. ఒకవేళ రేపటిలోగా బలం నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడిందని పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఈ 10 రోజుల సమయంలో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నాలు చేసుకోవచ్చనే కాంగ్రెస్‌ ఆశలు ఆవిరైనట్టయింది.   

కమల్‌ సర్కార్‌ను ‘కరోనా’కూడా రక్షించలేదు: శివరాజ్‌

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సారథ్యంలోని కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కరోనా వైరస్‌ కూడా రక్షించలేదని భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. మెజార్టీ లేదని తెలిసి సీఎం కమల్‌నాథ్‌ బల నిరూపణ పరీక్ష నుంచి పారిపోతున్నారని విమర్శించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా నేతలు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా 107 మందికి గాను 106మంది భాజపా ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఎదుట పరేడ్‌ నిర్వహించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. భాజపాకే మెజార్టీ ఉందని.. త్వరగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందనీ.. అధికారంలో కొనసాగే హక్కు కమల్‌నాథ్‌కు లేదన్నారు.  

మరోవైపు, సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కరోనా ప్రభావంతో పది రోజుల పాటు (ఈ నెల 26 వరకు) వాయిదా పడటంతో మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలం లేక సతమవుతున్న అధికార కాంగ్రెస్‌ పార్టీకి కాస్త ఉపశమనం లభించినట్టయింది. ఈ నేపథ్యంలో భాజపా సీనియర్‌ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో 10 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారమే బల నిరూపణ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సభా సమావేశాలను వాయిదా వేయడంపై ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 12 గంటల్లోగా బల నిరూపణ పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారించనుంది. 

కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో ఆయన విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలూ ఆయన వెంట వెళ్లారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆరుగురు మంత్రులతో కలిపి మొత్తం 22 మంది కాంగ్రెస్‌ సభ్యులు రాజీనామా చేయగా.. సభాపతి కేవలం మంత్రుల రాజీనామాలను మాత్రమే ఆమోదించారు. సింధియా పార్టీ మారడానికి ముందు కాంగ్రెస్‌ బలం 114; భాజపా 107; ఎస్పీ 1; బీఎస్పీ 2; ఇతరులు 4గా ఉండేది. మొత్తం 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ఆరుగురు మంత్రుల రాజీనామా (రెండు స్థానాలు ఖాళీ)లు ఆమోదం పొందడంతో ప్రస్తుత అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కి చేరింది. అసెంబ్లీలో కమల్‌నాథ్‌ సర్కార్‌ బలపరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం 112 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. సంక్షోభం తలెత్తే సమయానికి బీఎస్పీ, ఎస్పీతో పాటు నలుగురు ఇతరులు ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని