కరోనా: 2 రాష్ట్రాల్లో పుర ఎన్నికలు వాయిదా

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేలా ప్రజల్ని జన సమూహాలను దూరంగా......

Updated : 16 Mar 2020 20:23 IST

కోల్‌కతా: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేలా ప్రజల్ని జన సమూహాలను దూరంగా ఉంచాలనే సంకల్పంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిన్న సంచలన నిర్ణయం తీసుకోగా.. తాజాగా పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రలూ అదే బాటలో వెళ్లాయి. కోల్‌కతా పురపాలక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు అక్కడి ఎన్నికల సంఘం కమిషనర్‌ సౌరవ్‌ దాస్‌ వెల్లడించారు. ఈ మేరకు అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.

మరో 15 రోజుల తర్వాత సమావేశమై సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. బెంగాల్‌లోని అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ పురపాలక ఎన్నికలు అధికార తృణమూల్‌ కాంగ్రెస్, భాజపాకు ఎంతో ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. అలాగే, మహారాష్ట్రలో కూడా పురపాలక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 114 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు, బెంగాల్‌లో ఎలాంటి కేసులూ నమోదు కాలేదు.

రూ.200 కోట్లతో ఫండ్‌: దీదీ
కరోనా కట్టడికి రూ.200 కోట్లతో ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్టు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను ఏప్రిల్‌ 15 వరకు మూసివేయాలని ఆదేశించారు. సోమవారం కరోనా పరిస్థితిపై సమీక్షించిన ఆమె.. సినిమా థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని కోరారు. బెంగాల్‌లో 3.24లక్షల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని