నెగ్గేదెవరో.. ఓడేదెవరో..!

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మధ్యాహ్నం 2గంటలకు శాసనసభలో బలపరీక్ష జరగనుంది. ఇప్పటికే గురువారం సాయంత్రం సీఎం కమల్‌నాథ్‌ మాట్లాడుతూ..

Published : 20 Mar 2020 12:15 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మధ్యాహ్నం 2గంటలకు శాసనసభలో బలపరీక్ష జరగనుంది. ఇప్పటికే గురువారం సాయంత్రం సీఎం కమల్‌నాథ్‌ మాట్లాడుతూ.. రెబల్‌ ఎమ్మెల్యేలతో రహస్యంగా చర్చలు జరిపినట్లు.. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. కానీ రెబల్‌ ఎమ్మెల్యేల్లో మిగిలిన 16 మంది రాజీనామాలు సైతం నిన్న స్పీకర్‌ ఆమోదించడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. తాజా పరిస్థితుల ప్రకారం.. బలపరీక్షకు ముందే కమల్‌నాథ్‌ సీఎం పదవి నుంచి వైదొలగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను ప్రశ్నించగా.. కొద్దిసేపు ఓపిక పట్టండి.. సీఎం విలేకరుల సమావేశం నిర్వహిస్తారంటూ సమాధానం ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సింధియా వెంటే తాము ఉంటామన్నారు. వారిలో మొదట ఆరుగురి రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాపతి ఇప్పటికే ఆమోదించారు. కాగా బలపరీక్ష వెంటనే నిర్వహించాలంటూ భాజపా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బల పరీక్ష నిర్వహించేందుకు శుక్రవారం 5గంటల వరకు డెడ్‌లైన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గురువారం మరో 16 మంది రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు.

సంఖ్యా బలం ఇలా:

230 శాసనసభ స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 228 ఎమ్మెల్యేలుండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్‌ ఆమోదం పొందడంతో ఎమ్మెల్యేల సంఖ్య 206కు చేరింది. ప్రస్తుతం బలపరీక్షలో ఏ పార్టీ నెగ్గాలన్నా 104 మంది ఎమ్మెల్యేలు అవసరం. భాజపాకు 107 మంది సంఖ్యా బలం ఉంది. గతంలో 114 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్‌ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో 92కు చేరింది. మరో ఏడు మంది ఇతర పార్టీల సభ్యులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని