రైతులు ఆందోళన పడొద్దు: ఇంద్రకరణ్‌ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు సామాజిక దూరం పాటించినట్లయితే కరోనా వ్యాధిని అరికట్టవచ్చని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లాలోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు..

Published : 30 Mar 2020 17:42 IST

నిర్మల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు సామాజిక దూరం పాటించినట్లయితే కరోనా వ్యాధిని అరికట్టవచ్చని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లాలోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వలస కూలీలకు వసతి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు 1055 మంది విదేశాల నుంచి నిర్మల్‌ జిల్లాకు వచ్చినట్లు చెప్పారు. వారికోసం జిల్లా పాలనాధికారి నేతృత్వంలో ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. వైద్య సిబ్బంది, పోలీసులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  

అదేవిధంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. రైతులు పండించిన ప్రతి పంటనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1 నుంచి మొక్కజొన్న.. ఏప్రిల్‌ 15నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నిర్మల్‌ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే వరి విస్తీర్ణం రెండింతలు పెరిగిందని.. మొక్కజొన్న మూడింతలైందని వివరించారు. 201 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏ-గ్రేడ్‌కు 1835, బి-గ్రేడ్‌కు 1813 మద్దతు ధర అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలుకు 85 కేంద్రాలు ఏర్పాటు చేసి. రూ.1760 మద్దతు ధర చెల్లిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని