కరోనా నివారణ చర్యలపై జగన్‌ సమీక్ష

దేశ విదేశాలకు వెళ్లివచ్చిన కుటుంబాలను నిత్యం పరిశీలించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారిని గుర్తించేందుకు ...

Published : 31 Mar 2020 16:41 IST

అమరావతి: దేశ విదేశాలకు వెళ్లివచ్చిన కుటుంబాలను నిత్యం పరిశీలించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారిని గుర్తించేందుకు సర్వే కొనసాగించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరయ్యారు. కరోనా విస్తరణ, కొత్తగా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు. కొత్త కేసుల్లో చాలా మంది దిల్లీ జమాత్‌ సదస్సుకు వెళ్లి వచ్చారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రం నుంచి వెళ్లిన వారి వివరాలు సేకరించామని చెప్పారు. కొందరిని క్వారంటైన్‌కు, మరికొందరిని ఐసోలేషన్‌కు తరలించామని అన్నారు.

కరోనా లక్షణాలు ఉన్న వారు స్వయంగా ఆరోగ్య వివరాలు వెల్లడించాలని సీఎం జగన్‌ కోరారు. వాళ్లు ముందుకు రాకపోతే వారి కుటుంబ సభ్యులకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ప్రజల బాగు కోసమే సర్వే జరుగుతోందని.. ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. షెల్టర్లలో ఉన్నవారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్‌కు తరలించాలన్నారు. పట్టణాల్లోని రైతు బజార్లు, మార్కెట్‌ వికేంద్రీకరణపై మాట్లాడుతూ.. ప్రతి దుకాణం ఎదుట ధరల పట్టికను ప్రదర్శించాలని ఆదేశించారు. నిత్యావసరాల డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని