
అలాంటి వాళ్లనే సీఎం విమర్శించారు: తలసాని
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లనే సీఎం కేసీఆర్ విమర్శించారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అంటే తమకు గౌరవమేనని.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామని మంత్రి చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, కార్మికులకు తెలంగాణ ప్రజలతో సమానంగా నిత్యావసరాలను అందించడమే కాకుండా వైద్య పరంగా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందన్నారు. ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వాళ్లను 24 గంటల్లోనే గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇప్పటివరకు 14 రోజుల క్వారంటైన్లో ఉన్న వాళ్లను డిశ్చార్జ్ చేస్తున్నట్లు తలసాని చెప్పారు.