Updated : 13/04/2020 19:48 IST

రేషన్‌ కోసం కూపన్లు: మంత్రి కొడాలి

విజయవాడ: రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిబద్ధతతో పని చేస్తున్నారని మంత్రి కొడాలి నాని కొనియాడారు. హమాలీలు సైతం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమవుతుందన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ రాష్ట్రాలతో మాట్లాడారని నాని తెలిపారు. కేవలం 92 లక్షల కార్డులను మాత్రమే కేంద్రం పరిగణలోనికి తీసుకుంటుందన్నారు. వారికి మాత్రమే కేంద్రం ప్రకటించిన సాయం అందుతుందని.. అయితే రాష్ట్రంలో కోటి 40 లక్షల కార్డులు ఉన్నాయని మంత్రి మీడియాకు వెల్లడించారు.

ధాన్యం కొనుగోలు కోసం ఉంచిన డబ్బులను చంద్రబాబు పసుపు కుంకుమ కోసం వాడేశారని మంత్రి విమర్శించారు. గతంలో రూ.2 వేల కోట్లు, తాజాగా రూ. 2200 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. ‘‘రాష్ట్రంలో గోనె సంచులు అవసరం చాలా ఉంది. 45 వేల బేళ్ల గోనె సంచులు రావాలి. మార్చి 29 నుంచి ఇవాళ్టి వరకు కోటి 35 లక్షల మంది రేషన్ తీసుకున్నారు. రేషన్ పంపిణీలో అందరూ కష్టపడి పనిచేశారు. కొన్ని పొరపాట్లను ప్రతిపక్ష పార్టీలు గోరంతను కొండంత చేయడానికి  ప్రయత్నించాయి. ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా అందరికీ కూపన్లు ఇస్తున్నాం. రేషన్‌ దుకాణాలకు అందరూ కూపన్లు తీసుకునే రావాలి. రద్దీని నియంత్రించడానికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.

కరోనా వైరస్‌ బారిన పడి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయని మంత్రి తెలిపారు. కానీ, రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. విపక్షాలకు చెందిన నేతలు ప్రభుత్వం, అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ కానీ.. సంబంధిత మంత్రి కానీ ఎక్కడైనా విఫలమయ్యారా?అని కొడాలి నాని ప్రశ్నించారు.  కరోనాను నియంత్రించడంలో మన రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని.. నిత్యం అధికారులతో సీఎం జగన్‌ సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నారని మంత్రి చెప్పారు.

16 నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ: కోన శశిధర్ 

రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇప్పటికే తొలి విడత రేషన్, కందిపప్పు అందజేసినట్లు పౌరసరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ వెల్లడించారు. ఈ నెల 16 నుంచి రెండో విడత పంపిణీ చేపడతామన్నారు. రబి పంట సేకరణ కూడా ప్రారంభమైందని, దీనికోసం 993 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రతి గ్రామ సచివాలయంలో రైతుల పేర్ల నమోదు ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. ‘‘ పక్క రాష్ట్రాల్లో పండించిన పంట ఇక్కడికి రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ఉంచుతున్నాం. అక్కడ తక్కువకు కొని ఇక్కడ మిల్లర్లు ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంది. పౌరసరఫరాల శాఖ అంటే చౌక ధరల దుకాణాలు మాత్రమే కాదు. ఎల్‌పీజీ, పెట్రోల్ బంకుల ఔట్ లెట్లు కూడా  పౌరసరఫరాల పరిధిలోకే వస్తాయి. లబ్ధిదారులకు ముందుగానే కూపన్లు ఇచ్చి రేషన్  అందిస్తాం. కార్డుదారులెవరూ తొందర పడొద్దు. సరిపడా సరుకులు అందుబాటులోనే ఉన్నాయి. ఈ-క్రాప్ డేటా ఆధారంగా  ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నాం. గ్రామ సచివాలయంలో రైతులు, కౌలు రైతుల వివరాలు ఉంచుతాం. మద్దతు ధర కంటే తక్కువకు రైతులు పంటను అమ్ముకోవాల్సిన పని లేదు. ఇంత ఇబ్బందుల్లోనూ అన్ని చౌకధరల దుకాణాలకు సరుకులు అందజేశాం. 16 నుంచి కుటుంబానికి కేజీ శనగలు పంపిణీ చేస్తాం. రేషన్ దుకాణాల సమయాలు ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు. లబ్ధిదారులు ఎలాంటి సమస్య ఉన్నా టోల్‌ఫ్రీ నెంబర్‌  1902కి ఫోన్‌ చేసి చెప్పవచ్చు. పాత కార్డులు ఉన్న వారందరికీ రేషన్ ఇస్తాం. బతుకు తెరువు కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు పోర్టబిలిటీ కింద రేషన్ తీసుకోవచ్చు. మార్చి 29 నుంచి 30 లక్షలకు పైగా పోర్టబిలిటీ కింద రేషన్ తీసుకున్నారు’’ అని కమిషనర్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని