
హైకోర్టు తీర్పును రాజకీయం చేస్తున్నారు: అనిల్
అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతోనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆంగ్ల మాధ్యమంపై తెదేపా నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. తెదేపా నేతలంతా వారి వారి పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తుంటే.. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా అని నిలదీశారు. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అనిల్‌కుమార్ మండిపడ్డారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజలకు సాయం అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.
మరోవైపు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రాసిన లేఖ తెదేపా కార్యాలయంలోనే తయారైందని, లేఖను తెదేపా ఎంపీ కనకమేడల డ్రాఫ్టింగ్ చేశారని వైకాపా ఆరోపించింది. దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేయడంతో తానే లేఖ రాశానని నిమ్మగడ్డ రమేశ్ చెబుతున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. లేఖపై పలు సందేహాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి విజయసాయిరెడ్డి లేవనెత్తిన మూడు ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేశ్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.