వైకాపా వైఫల్యాలకు కరోనా ముసుగు: యనమల

కరోనా ముసుగులో గతేడాది(2019-20) వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి, వైకాపా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని...

Updated : 08 Dec 2022 15:02 IST

అమరావతి: కరోనా ముసుగులో గతేడాది(2019-20) వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి, వైకాపా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతేడాది రాబడులు తగ్గడానికి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలే కారణం తప్ప, కరోనా వల్ల కాదని స్పష్టం చేశారు.  జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ప్రభావం గత ఆర్థిక సంవత్సరంపై మార్చి చివరిలో 9 రోజులు మాత్రమే ఉందని పేర్కొన్నారు. గతేడాది ఎక్సైజ్‌ రాబడి రూ.6,536 కోట్లకు పెరగడంపై సీఎం జగన్‌ ఏం చెబుతారని ప్రశ్నించారు. రూ.336 కోట్ల మద్యం విక్రయాలు పెరిగాయని ప్రభుత్వ లెక్కలే చెప్పాయన్నారు. 

పొరుగు రాష్ట్రాల నుంచి తరలించిన అక్రమ మద్యం విక్రయాలకు లెక్కేలేదని మండిపడ్డారు. కరోనా పేరు చెప్పి ఉద్యోగుల మార్చి నెల జీతాలు, పెన్షన్లలో సగం కోత పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమ పథకాల్లో భారీ కోతలుపెట్టి, అనేక పథకాలను రద్దు చేశారన్నారు. వీటన్నింటి ద్వారా రూ.వేల కోట్లు ఆదా చేసుకున్నట్లు తెలిపారు. గతేడాది కేంద్రం నుంచి నిధులు పుష్కలంగా వచ్చాయని, 14వ ఆర్థిక సంఘం బకాయిలు రూ.1300 కోట్లు, నరేగా నిధులు మరో వెయ్యి కోట్లపైనే వచ్చాయన్నారు. 

డివల్యూషన్‌ నిధులు, ఇతర కేంద్ర నిధులు అందాయన్నారు. కరోనా కోసం కేంద్రం అదనపు నిధులు ఇచ్చిందని, ఆ నిధులన్నీ విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులేసి నిధులు వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో వాదనలకు భారీగా నిధుల ఖర్చు చేస్తున్నారని, నాలుగు లక్షల గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి జీతాల పేరుతో వైకాపా కార్యకర్తలకు ఏడాదికి రూ.4వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.13వేల కోట్ల భారం పడిందని చెప్పడం పచ్చి అబద్దమని యనమల స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని