విజయసాయి వ్యాఖ్యలపై కన్నా కౌంటర్‌

కరోనా రక్షణ కిట్ల గురించి ప్రశ్నిస్తుంటే వైకాపా నేతలు తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

Updated : 21 Apr 2020 18:22 IST

గుంటూరు: కరోనా రక్షణ కిట్ల గురించి ప్రశ్నిస్తుంటే వైకాపా నేతలు తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలో భాజపా అధినాయకత్వం రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది.. అందులో ఎంత దుర్వినియోగం జరిగిందనే వివరాలు తన వద్ద ఉన్నాయంటూ విజయసాయి చేసిన ఆరోపణలను కన్నా ఖండించారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే  సంస్కృతి భాజపాది కాదన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన సాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడే నైజం వైకాపాదేనని ఆరోపించారు. పచ్చకామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని విజయసాయిని ఉద్దేశించి విమర్శించారు. ప్రతివారం కోర్టుకెళ్లి ప్రమాణం చేయడం, అబద్ధాలు చెప్పడం విజయసాయిరెడ్డికి అలవాటేనని.. ప్రమాణాలేమీ ఆయనకి కొత్త కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు వద్ద తాను రూ.20కోట్లు తీసుకున్నానంటూ చేసిన ఆరోపణలపై కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తారా? అని విజయసాయికి సవాల్‌ విసిరానని.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల బట్టి ప్రమాణానికి వస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ పూర్తవగానే తేదీ, సమయం నిర్ణయిస్తానని.. విజయసాయిరెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని కన్నా కోరారు. 

కేసులు దాచిపెడుతున్నారు..

వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల వల్లే కరోనా వ్యాప్తి జరుగుతోందని కన్నా ఆరోపించారు. విజయసాయిరెడ్డి విజయవాడ, విశాఖ.. ఇలా తిరుగుతున్నారని ఆక్షేపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన తండ్రి మృతిచెందినా వెళ్లలేదని గుర్తు చేశారు. రాజధాని విశాఖకు వెళ్తుందా? లేదా? అనే దానిపై కాలమే సమాధానం చెబుతుందని కన్నా చెప్పారు. కరోనా కిట్ల వ్యవహారంలో పర్చేజ్‌ ఆర్డర్‌, మంత్రి, అధికారుల ప్రకటనల్లో తేడాలున్నాయని చెప్పారు. కిట్ల ధర విషయంలో వచ్చిన ఆరోపణలపై పారదర్శకతను నిరూపించుకోవాలని ప్రతిపక్ష పార్టీగా తాము కోరామన్నారు. తప్పు చేశారు కాబట్టే వ్యక్తిగత దూషణలతో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. భిన్నమైన ప్రకటనలు చేశారని.. పథకం ప్రకారం ఏదో జరిగినట్లు కనిపిస్తోందని కన్నా వ్యాఖ్యానించారు. కరోనా కేసులను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని.. దీనిలో తనకెలాంటి సందేహం లేదన్నారు. ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పడం లేదని ఆయన ఆరోపించారు.

ఇవీ చదవండి..

కన్నాపై మళ్లీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు

నన్ను కొనేవాళ్లు పుట్టలేదు : కన్నా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని