రాహుల్‌.. పేదలకు మాస్క్, శానిటైజర్‌ వద్దా?

పేదల బియ్యం కొరత లేదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ అన్నారు. శానిటైజర్లు, మాస్క్‌లు పేదలు ఉపయోగించకూడదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన ప్రతికూల మనస్తత్వాన్ని మార్చుకోవాలని ఘాటుగా విమర్శించారు.....

Published : 22 Apr 2020 00:54 IST

ధనికులు మాత్రమే వాడాలన్నది మీ ఉద్దేశమా: పాసవాన్‌

దిల్లీ: పేదల బియ్యం కొరత లేదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ అన్నారు. శానిటైజర్లు, మాస్క్‌లు పేదలు ఉపయోగించకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన ప్రతికూల మనస్తత్వాన్ని మార్చుకోవాలని ఘాటుగా విమర్శించారు.

మిగులు బియ్యంతో ఇథనాల్‌ ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్ల తయారీ, పెట్రోల్‌తో కలిపి వాడేందుకు ఉపయోగించాలని ఆదేశించింది. శానిటైజర్లతో ధనవంతుల చేతులు కడగడానికి పేదల బియ్యం ఉపయోగిస్తారా? అని రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ వ్యవహారం పాసవాన్‌ మంత్రిత్వ శాఖకు సంబంధించింది కావడంతో ఆయనతోనే ప్రభుత్వం సమాధానం చెప్పించినట్టు తెలుస్తోంది.

‘భారత్‌ కరోనా వైరస్‌తో పోరాటం చేస్తుంటే ధనవంతులు మాత్రమే శానిటైజర్లు, మాస్క్‌లు వాడాలని రాహుల్‌ కోరుకుంటున్నారా? పేదలను చావుకు వదిలేయాలా? పేదలు సైతం కొనగలిగే ధరల్లో శానిటైజర్లు ఉత్పత్తి చేయాలన్నది మా దీర్ఘకాల ప్రణాళిక. దేశానికి ప్రమాదకరమైన ప్రతికూల మనస్తత్వాన్ని ఆయన మార్చుకోవాలి’ అని పాసవాన్‌ అన్నారు.

‘ఎవరూ ఆకలితో ఉండొద్దన్నదే మా తొలి ప్రాధాన్యత. శానిటైజర్లు, మాస్క్‌లు కేవలం ధనికులకు మాత్రమే అన్నది తప్పుడు భావన. పేదలు సైతం వాటిని ఉపయోగించాలనే మేం కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అవసరమైన బియ్యం, నిత్యావసరాలను రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ప్రజలకు వాటిని అందివ్వడం రాష్ట్రాల బాధ్యత. ఎక్కడైనా ప్రజలు ఇప్పటికీ ఆకలితో అల్లాడుతోంటే రాష్ట్రాలు, కేంద్రం దృష్టికి తీసుకురావాలని రాహుల్‌ను కోరుతున్నాను. మూడు నెలలు ఉచిత రేషన్‌ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది’ అని పాసవాన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని