కనీస సహాయం రూ.7500 ఇవ్వాలి: సోనియా

దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి(సీడబ్యూసీ) గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ కరోనా పరీక్షల నిర్ధారణ విషయంలో ఇంకా...

Published : 24 Apr 2020 00:14 IST

సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి(సీడబ్ల్యూసీ) గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ కరోనా పరీక్షల నిర్ధారణ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నామని విమర్శించారు. అలాగే దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల కొరత ఉందన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోనడానికి ట్రేసింగ్‌, టెస్టింగ్‌, క్వారెంటైన్‌ విధానాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని, దానికి ప్రత్యామ్నాయం లేదని.. ఇదివరకే ప్రధాని నరేంద్రమోదీకి అనేక సార్లు విన్నవించామని చెప్పారు. దురదృష్టం కొద్దీ భారత్‌లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఇంకా చాలా తక్కువ సంఖ్యలోనే జరుగుతున్నాయని, ఈ విషయంలో మరింత వేగవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు. అలాగే వైద్య సిబ్బందికి సరిపడా పీపీఈ కిట్లు అందుబాటులో లేవని, వెంటనే వాటిని కొనుగోలు చేయాలన్నారు. 

కనీస సహాయం రూ.7500 గా ఉండాలి

మూడు వారాల క్రితం సీడబ్ల్యూసీ సమావేశం జరిగినప్పటితో పోలిస్తే ఇప్పుడు వైరస్‌ తీవ్రత, వ్యాప్తి పెరిగిందని సోనియా అన్నారు. మరోవైపు చైనా నుంచి అధికమొత్తంలో దిగుమతి చేసుకున్న పీపీఈ కిట్ల నాణ్యత, సామర్థ్యంపైనా విమర్శలు చేశారు. లాక్‌డౌన్‌తో తొలి దశలో 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆమె అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో  కేంద్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ.7500 ఇవ్వాలని చెప్పారు. అలాగే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వారిని ఆదుకొని ఖరీఫ్‌ పంటపై భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా వలసదార్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారంతా ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో తల్లడిల్లుతున్నారన్నారు. వలస కార్మికులకు భోజన వసతులతో పాటు ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ 19ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యంపైనే లాక్‌డౌన్‌ విజయవంతంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు ఈ మహమ్మారిపై విజయం సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఇవీ చదవండి:

కరోనా వైరస్‌ను మొదట కనిపెట్టింది ఆమేనట!

తప్పు చేయొద్దు.. సుదీర్ఘకాలం మనతోనే కరోనా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని