కరోనా వైకాపాకు ఏటీఎంలా మారింది: బాబు

కరోనా విపత్తు వేళ ప్రజలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విపత్తుల సమయాల్లో...

Published : 30 Apr 2020 01:44 IST

అమరావతి: కరోనా విపత్తు వేళ ప్రజలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విపత్తుల సమయాల్లో తెదేపా వెన్నంటి నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలన్నారు. పేదలను, కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, రైతులకు సాయమందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

రైతు భరోసా అని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది పేర్లను తొలగించిందని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా స్థానిక ఎన్నికలపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించారని, ఓట్ల కక్కుర్తితో గుంపులుగా తిరిగారని ఆరోపించారు. అడ్డగోలు చర్యలతో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ప్రమాదంలోకి నెట్టారని దుయ్యబట్టారు. దేశంలో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న 15 జిల్లాల్లో కర్నూలు ఒకటి కావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. కరోనా రావడం వైకాపా నాయకులకు ఏటీఎంలా మారిందన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు విపరీతంగా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి వాటిపై మండలస్థాయిలో దీక్షలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. తెదేపా నేతలు తరచూగా రాస్తున్న లేఖలతో విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇవీ చదవండి..

మత్స్యకారులకు ₹2 వేలివ్వండి: జగన్‌

వారిపై సానుభూతి చూపించండి: పవన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని