మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోవడమే

కరోనాతో అనేక మంది అనారోగ్యం పాలవుతుంటే.. వైకాపా ప్రభుత్వం మాత్రం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతోందని శాసనమండలిలో ప్రధాన ...

Updated : 04 May 2020 13:16 IST

యనమల రామకృష్ణుడు విమర్శ

అమరావతి: కరోనాతో అనేక మంది అనారోగ్యం పాలవుతుంటే.. వైకాపా ప్రభుత్వం మాత్రం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతోందని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ధరల పెంపు నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోవడమేనని మండిపడ్డారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలపై రూ.5వేల కోట్ల భారం మోపడం గర్హనీయమన్నారు. మద్యం కంపెనీల ఒత్తిళ్ల మేరకే ఇప్పుడీ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందని.. నాసిరకం మద్యం అమ్మకాలు పెగిరిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు నాటుసారా తయారీ వెనుక ఉండి వాలంటీర్ల ద్వారా అమ్మకాలు జరుపుతున్నారని యనమల ఆరోపించారు. 

ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా ఏపీలో మాత్రం అక్రమ మద్యం అమ్మకాలు పేట్రేగాయని యనమల విమర్శించారు. గతంలో ఎలుకలు ఇనుము తిన్నాయని కథల ద్వారా విన్నామని.. ప్రస్తుతం వైకాపా పాలనలో ఎలుకలు మద్యం తాగటాన్ని చూస్తున్నామని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో దశలవారీగా మద్యం నిషేధిస్తామని మేనిఫెస్టోలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వైకాపా ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. మద్యం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని యనమల ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.  

ఇదీ చదవండి..
ఏపీలో మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని