కేసీఆర్‌తో జగన్‌ భేటీ తర్వాతే ఆ జీవో: రేవంత్‌

పోతిరెడ్డిపాడుపై కుట్రపూరితంగా ప్రజలను మోసం చేసేందుకు యత్నం జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 2 టీఎంసీల

Updated : 20 May 2020 12:25 IST

హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడుపై కుట్రపూరితంగా ప్రజలను మోసం చేసేందుకు యత్నం జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 2 టీఎంసీల ఎత్తిపోతకు రూ. లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. భావితరాల జీవితాలు తాకట్టు పెట్టి పథకం చేపడుతున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి షెకావత్‌తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ ఎండిపోతుందని.. హైదరాబాద్‌కు మంచి నీటి సమస్య వస్తుందన్నారు.

వాస్తవాలు బయటపెట్టాలి..: రేవంత్‌ రెడ్డి

‘పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు 2005లోనే ఆదేశాలు వచ్చాయి. ప్రాజెక్టు సామర్థ్యం 11 వెల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఆనాడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్‌ ఉన్నారు. తెలంగాణ ప్రక్రియ ఆలస్యం అవుతోందని కేసీఆర్‌ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం కేసీఆర్‌ పోతిరెడ్డిపాడుపై ప్రస్తావన కూడా తేలేదు. పోతిరెడ్డిపాడుపై వైఎస్‌ఆర్‌ హయాంలో పోరాడినట్లు కేసీఆర్‌ చెబుతున్నారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సీఎం జగన్‌ భేటీ అయిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ భేటీకి సంబంధించి వాస్తవాలను బయటపెట్టాలి. నాలుగు జిల్లాలు ఎడారిగా మారేందుకు ఏపీ జీవో కారణమవుతోంది. దీనిపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పోరాడుతుంది’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని