తెదేపాపై దుష్ప్రచారం సరికాదు:చంద్రబాబు

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ అనుమతులకు సంబంధించి తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు వైకాపా ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని చెప్పడం అవాస్తవమన్నారు.

Updated : 20 May 2020 12:51 IST

అమరావతి: విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ అనుమతులకు సంబంధించి తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు వైకాపా ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని చెప్పడం అవాస్తవమన్నారు. సీఎం జగన్‌ అవాస్తవాలు పరాకాష్టకు చేరాయని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో రాజకీయ లాభాలు పొందాలని చూడటం హేయమైన చర్య అన్నారు. తెదేపా హయాంలో ఎకరం భూమి కూడా ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థకు కేటాయించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించి 1961 నుంచి 2020 వరకు పూర్వాపరాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. ‘‘కంపెనీ వినియోగిస్తున్న 219 ఎకరాల భూమిని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరా రూ.2,500 చొప్పున కేటాయించింది. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ మినహాయింపులను సైతం అప్పటి ప్రభుత్వమే ఇచ్చింది. 2007లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. 2009 సెప్టెంబర్‌ 1న మరోసారి వైఎస్‌ ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు ఇచ్చింది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2012లో రెండు సార్లు అనుమతులు వచ్చాయి. ఇలా వైఎస్‌, కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాలు రెండు సార్లు చొప్పున అనుమతులు మంజూరు చేశాయి. గత ప్రభుత్వాలు జారీ చేసిన పర్యావరణ అనుమతులకు సంబంధించిన సర్టిఫికెట్లను తెదేపా ప్రభుత్వం రెన్యువల్‌ మాత్రమే చేసింది. పాలీస్టైరీన్‌, ఉత్పత్తుల విస్తరణకు తెదేపా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది’’ అని చంద్రబాబు వివరించారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు సంబంధించి తెదేపా సమర్పించిన వివరాలపై వైకాపా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా?అని చంద్రబాబు సవాల్‌ విసిరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని