
దసరా నాటికి లక్ష ఇళ్లు పూర్తి: కేటీఆర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో అధికారులతో కేటీఆర్ సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఇప్పటికే ఇళ్లు పంపిణీ చేశామని.. చాలా చోట్ల 80 శాతానికిపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. వాటిని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. ఆగస్టు నాటికి గ్రేటర్ పరిధిలో 50 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. దసరా నాటికి జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
గ్రేటర్ పరిధిలో 45 బస్తీ దవాఖానాలు..
ఈ నెల 22న గ్రేటర్ పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌లో 22, మేడ్చల్ జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 3 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయని వివరించారు. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాలతో అదనంగా మరో 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయన్నారు. ఒక్కో బస్తీ దవాఖానలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక సహాయకుడు ఉంటారన్నారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.