Published : 21 May 2020 03:14 IST

యోగి×ప్రియాంక: అవి రాజస్థాన్‌ బస్సులు!

1049 బస్సుల్లో 460 నకిలీ బస్సులు: యూపీ ఉప ముఖ్యమంత్రి

బస్సులకు భాజపా జెండాలు అంటించి నడపండి: ప్రియాంక

లక్‌నవూ: సంక్షోభ కాలంలో గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్‌ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ ఆరోపించారు. అసలు కాంగ్రెస్‌ పార్టీ బస్సులే లేవని స్పష్టం చేశారు. అవన్నీ రాజస్థాన్‌ ప్రభుత్వానికి చెందినవని వెల్లడించారు.

కాంగ్రెస్‌ 1,049 బస్సులు వివరాలను పంపించిందని అందులో 460 నకిలీవే ఉన్నాయని శర్మ తెలిపారు. 297 బస్సులు తుప్పుపట్టాయని పేర్కొన్నారు. ‘ఫిట్‌గా లేని బస్సుల్ని నడిపి వలస కూలీల జీవితాల్ని ఆపదలోకి నెట్టేయాలా? జాబితాలో 98 ఆటోలు, కార్లు, అంబులెన్సులు ఉన్నాయి. 68 వాహనాలకు సరైన రిజిస్ట్రేషన్‌, బీమా పత్రాలు లేవు. ఏ రాజకీయ పార్టీ అయినా రాజస్థాన్‌ ప్రభుత్వ బస్సులను సొంతానికి వాడుకోవచ్చా? ప్రభుత్వ వనరులను పార్టీలు ఎలా వాడుకుంటాయి? వేటి ఆధారంగా ఈ బస్సులు నడుస్తాయి?’ అని దినేశ్‌ శర్మ ప్రశ్నించారు.

‘కోటాలో మా పిల్లలు ఆహారం, నీరు, చికిత్స అందక అల్లాడిపోయినప్పుడు రాజస్థాన్‌ ముఖ్యమంత్రికి ఎందుకు బాధ కలగలేదు? అప్పుడీ బస్సులన్నీ ఎక్కడికి పోయాయి? ఇతర రాష్ట్రాల్లోని యూపీ వలస కార్మికులకు నిజంగా సాయం చేయాలనుకుంటే బస్సులను రాజస్థాన్‌, పంజాబ్‌, మహారాష్ట్రకు పంపించండి. కాంగ్రెస్‌ ఎందుకు మహారాష్ట్ర, పంజాబ్‌కు పంపించలేదు. సీఎం యోగి కోరిక మేరకు 1000 రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 10 లక్షలకు పైగా వలసదారులు తిరిగొచ్చారు. 27,000 బస్సుల్లో 6.50 లక్షల మంది వచ్చారు. ప్రభుత్వ సమయాన్ని దుర్వినియోగం చేసినందుకు కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలి’ అని దినేశ్‌ శర్మ విరుచుకుపడ్డారు.

రాజకీయం వద్దు: ప్రియాంక గాంధీ

బస్సుల వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడారు. వలస కూలీలు దేశానికి వెన్నెముక లాంటివాళ్లని అన్నారు. వారిని తరలించేందుకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ‘వలస కూలీల కోసం మేం బస్సులు సిద్ధం చేసి 24 గంటలు కావొస్తోంది. ఇంతవరకు వాటిని వినియోగించుకోలేదు. మీకు ఆ ఆలోచన లేకపోతే మాకు అవకాశం ఇవ్వండి. మేం వాటిలో వలస కూలీలను ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకొస్తాం. ఆ బస్సులపై భాజపా జెండాలు, స్టిక్కర్లు పెట్టుకొని మీరే బస్సులు సిద్ధం చేశామని చెప్పుకుంటామన్నా ఫర్వాలేదు. కానీ బస్సుల్ని మాత్రం నడపండి’ అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, అశోక్‌ సింగ్‌ తదితరులు సైతం భాజపాపై విమర్శలు గుప్పించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని