‘అలా చేయడం ప్రజలను అవమానించినట్లే’

ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజునే దీక్షలు చేయటం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. నిరసనలు, దీక్షలు చేయడానికి మరో

Published : 03 Jun 2020 01:59 IST

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌: ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజునే దీక్షలు చేయటం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. నిరసనలు, దీక్షలు చేయడానికి మరో రోజు దొరకలేదా అంటూ కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆవిర్భావ సంబురాలు జరుపుకుంటుంటే.. కాంగ్రెస్‌ నేతలు దీక్షలు చేయడం ఏంటని మంత్రి ఆక్షేపించారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ సర్కార్‌దేనని నిరంజన్‌ రెడ్డి అన్నారు. వ్యవసాయం, మిషన్‌ భగీరథ, ఐటీ, ఫార్మా‌, ఇతర అనేక రంగాల్లో నేడు తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల కేసీఆర్‌ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్‌, వట్టెం, కరివెన జలాశయాల పనులు 75 శాతం పూర్తయ్యాయని.. ఈ జలాశయాల్లో ఏడాదిలోపు నీళ్లు పారిస్తామని మంత్రి నిరంజన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

పదవుల కోసం ప్రాజెక్టులు అడ్డుకున్నవాళ్లు ఇవాళ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు. చెరువుల్లో పూడిక కూడా తీయని వాళ్లు ఇవాళ జలాశయాల వద్ద దీక్షలు చేస్తు్న్నారని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధి చూసి ఓర్వలేకే ఇలాంటి పనులు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని