వైకాపా ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైకాపాపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.  ఆ పార్టీ ఉన్నత స్థాయి నాయకత్వంపైనా విమర్శలు చేశారు. వైకాపా నేతలు కాళ్లా

Updated : 16 Jun 2020 13:19 IST

అమరావతి: వైకాపాపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.  ఆ పార్టీ ఉన్నత స్థాయి నాయకత్వంపైనా విమర్శలు చేశారు. వైకాపా నేతలు కాళ్లా వేళ్లా పడి బతిమాలితేనే తాను పార్టీలో చేరానని స్పష్టంచేశారు. సీఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వనుందుకే మీడియా ముందు స్పందిస్తున్నానని చెప్పారు.

‘‘ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న ఇళ్ల పథకంలో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయి. కొనుగోళ్లలో కూడా గోల్‌మాల్‌ జరుగుతోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా భూములు కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంటే కొందరు కమీషన్లు తీసుకుంటున్నారు. తిరుమల భూముల వేలం, ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు తరలింపు వంటి అంశాలపై నేను మీడియాతో మాట్లాడా. దీనిపై కొందరు నొచ్చుకున్నారు. పార్టీ అభిమానులు కూడా తప్పుపట్టారు. సీఎంకు సమయం అడిగినా లభించకపోవడంతోనే నేను చెప్పాల్సి వచ్చింది.
మా పార్టీలో విచిత్రమైన సిద్ధాంతం ఉంది. ఎవర్నైనా ఏదైనా అనాలంటే ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే చేత మాట్లాడిస్తారు. నా మీద నా మిత్రుడు నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు చేత కామెంట్లు చేయించారు. జగన్మోహన్‌ రెడ్డి సీటిస్తే నేను ఎంపీ అయ్యానని, ఆయన దయతోనే పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌ అయ్యానని కామెంట్లు చేశారు. గత మూడు నెలలుగా నియోజకవర్గంలో తిరగలేదని విమర్శించారు. నన్ను తిడితే ఆయనకు మంత్రి పదవి రావొచ్చు. నేనూ రావాలనే కోరుకుంటున్నా. పార్టీలోకి రావాలని వైకాపా నేతలు కాళ్లా వేళ్లా బతిమిలాడితేనే నేను పార్టీలోకి వచ్చా. నేను కాబట్టే నరసాపురంలో నెగ్గా. నన్ను చూసే మా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రజలు ఓటేశారు. పార్టీలో ఉన్నతమైన పదవులన్నీ ఆ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారికే దక్కాయన్నది బహిరంగ రహస్యమే. అయినప్పటికీ నాకు పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌ పదవి దక్కింది. దయచేసి మా కులాన్ని ఈ కులాల రొంపిలోకి లాగొద్దు. మా చిన్న కులంలో చిచ్చు పెట్టొద్దు’’ అని రఘురామ కృష్ణం రాజు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని